ఇప్పటివరకు ఒక భర్త కి చాలా మంది బార్యలు ఉంటారని మనం విన్నాం కాని ఇది అందుకు భిన్నంగా పూర్తి రివర్స్ ఘటన.. ఆమె తన అందంతో వలేస్తుంది. మాటలతో మత్తెకిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం… ప్రేమంటే ఇదేరా అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుందాం రా అని పిలుస్తుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు. అక్కడి నుంచి ఆమె అసలు కథ మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన అరుదైన ఘరానా మోసమిది. నిత్య పెళ్లి కొడుకులను, పెళ్లి కూతుళ్ల గురించి వినే ఉంటారు.

అయితే, ఈ యువతి నిత్య పెళ్లి కూతుళ్ల జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్టుంది. ఇక వివరాలు చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరానికి చెందిన ప్రీతీ అనే వివాహిత తన భర్తతో కలిసి సీరియల్ పెళ్లిళ్లకు తెర లేపింది. ప్రీతి అందంగా ముస్తాబై వచ్చి యువకులను తన అందంతో ఆకర్షించి ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకోమని అడుగుతోంది. సాక్షాత్తూ అందాల రాశి అయిన ప్రీతీనే అడగడంతో యువకులు పెళ్లికి రెడీ అయిపోతారు. అంతే మూడు ముళ్లు పడగానే వధువు ప్రీతి కాస్తా నగలు, డబ్బుతో పారిపోతోంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది వరులను మోసగించిందని యూపీ జిల్లా ఎస్పీ ఉదయ్ శంకర్ చెప్పారు.

లేడీ కిలాడీ మోసాలపై సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో.. ఆమెకు మొగుళ్లయిన యువకులు సైతం ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఈ లేడీ కిలాడీ ఇంత నిర్భీతిగా మోసాల పెళ్లిళ్ల తంతు సాగించిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రీతి యువకులను ఆకట్టుకొని వారిని పెళ్లి పీటలెక్కించి మోసగించి పారిపోతున్న వ్యవహారంలో ఆమె భర్త పాత్ర కూడా ఉందని తెలిసి అంతా నివ్వెరపోయారు. పెళ్లి ఏర్పాట్లు భర్తే చూసే వాడని పోలీసులు పేర్కొన్నారు. వీరి వెనుక మరికొందరు ముఠా సభ్యుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఆఖరు పెళ్లి కొడుకు ధైర్యం చేశాడు. చిన్నగా కూపీ లాగితే తనకంటే ముందు 11 మంది భర్తలు అదే రకంగా మోసపోయిన బాధితులున్నారన్న నిర్ఘాంతపోయే విషయం బయటపడింది. ధైర్యం చేసి పోలీసులకు మొత్తం చెప్పేశాడు. ఫలితం ఆ మాయలాడి, ఆమె అందాన్ని ఎరగా చేసుకుని డబ్బు సంపాదనకు మరిగిన మొగుడు ఇద్దరూ కటకటాల పాలయ్యారు…



























