22 years love Story : యవ్వనంలో ఉన్నపుడు ఆడ, మగ మధ్య ఆకర్షణ మామూలే. అయితే కొంత మంది మాత్రం నిజాయితీగానే ప్రేమించుకుంటారు. ఈ తరంలో అయితే చిన్న విషయాలకే బ్రేక్ అప్ చెప్పుకునే బ్యాచ్ లు ఎక్కువ, అలాంటి వారికి ఈ ప్రేమకథ స్ఫూర్తి దాయకం. తల్లిదండ్రులు ప్రేమకు అంగీకరించకపోతే లేచిపోయి పెళ్లి చేసుకునే వారిని చూసుంటాం. లేకపోతే తల్లిదండ్రులకు భయపడి ఇక ప్రేమించినవాడిని వదులుకుని వేరేవాళ్ళతో పెళ్లికి ఒప్పుకునే వాళ్ళను చూసుంటాం. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా 22 ఏళ్ళు ఎదురుచూడడం అంటే ఆశ్చర్యం కలిగించక మానదు.

కులం వేరని వద్దన్న పెద్దలు… 22 ఏళ్ళు నిరీక్షించి ఒప్పించుకున్న ప్రేమికులు…
సోషల్ మీడియా ద్వారా బయటకి వచ్చిన ఈ అమర ప్రేమకథ బాగా వైరల్ అయింది. పూర్తిగా వివరాలు తెలియకపోయినా సోనియా అనే ఒక మహిళ చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు. అతను కూడా ఆమెను అంతే నిజాయితీగా ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు ఇంట్లో పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. కులాలు వేరని అడ్డుచెప్పారు. మీది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే అని చెప్పి వారించారు. అయితే ఆ ప్రేమ జంట మాత్రం వారిది ప్రేమ అని నిరూపించుకోడానికి పెద్దలు తమ పెళ్ళికి అంగీకరించడానికి ఒపికగా నిరీక్షించారు.

అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 22ఏళ్ళు వారు ఎదురుచూశారు. పెద్దలను ఎదిరించి వెళ్లి పెళ్లి చేసుకోవాలని వారు భావించలేదు. అలా అని పెద్దలకు తలవంచి వారి ప్రేమను సమాధి చేయలేదు. ఇద్దరిదీ నిజమైన ప్రేమ అని నిరూపించి చివరకు పెద్దలను ఒప్పించి 22 ఏళ్ల తరువాత ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకథ నేటి తరం ప్రేమికులకు ఆదర్శం.































