2027 ఆగస్టు 2వ తేదీన, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మరియు మధ్యప్రాచ్యంలో నివసిస్తున్న వారిని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం జరగనుంది. ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్’గా పిలవబడే ఈ సూర్యగ్రహణం, భూమిపై ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా కొనసాగే గ్రహణంగా నిలవనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేస్తూ 6 నిమిషాల 23 సెకన్ల పాటు భూమిపై గాఢచీకటిని వ్యాపింపజేస్తుంది.

ఎక్కడ, ఎప్పుడు?
ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రారంభమై తూర్పు దిశగా కదిలి యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యాన్ని తాకుతుంది. దక్షిణ స్పెయిన్‌లోని కాడిజ్, మలాగా నగరాల్లో 4 నిమిషాలకుపైగా టోటాలిటీ (పూర్తి గ్రహణం) కనిపించనుంది.
ఇక ఉత్తర మొరాకో, ఈజిప్ట్‌లోని లక్సర్, మరియు సౌదీ అరేబియాలోని జెడ్డా, మక్కా, యెమెన్, ఈశాన్య సోమాలియా ప్రాంతాల్లో 6 నిమిషాలకు పైగా సూర్యుడు కనుమరుగవుతాడు. చివరికి ఈ గ్రహణం భారత మహాసముద్రంలోని చాగోస్ దీవులు మీదుగా ముగుస్తుంది.
ఈ గ్రహణం ఎందుకు ప్రత్యేకం?
ఈ సూర్యగ్రహణం అత్యంత దీర్ఘంగా ఉండడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి:
- భూమి అఫీలియన్ (సూర్యునికి దూరంగా) ఉండటం వల్ల సూర్యుడు చిన్నగా కనిపించడం.
- చంద్రుడు పెరిజీలో (భూమికి దగ్గరగా) ఉండడం వల్ల చంద్రుడి అంగుళం (అపరెంట్ సైజు) పెరగడం.
- భూమధ్యరేఖ సమీపంలో గ్రహణం సంభవించడం వల్ల చంద్రుని నీడ నెమ్మదిగా కదలడం.
ఈ మూడు కారణాల వల్ల గ్రహణం అనూహ్యంగా ఎక్కువ సేపు కనిపిస్తుంది, ఇది 1991 నుంచి 2114 మధ్య జరిగే అన్ని గ్రహణాల్లోనే అత్యంత సుదీర్ఘంగా నమోదవుతుందన్నది ఖచ్చితం.
భారతదేశంలో కనిపించదు
ఈ అద్భుత దృశ్యం భారతదేశం సహా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో మాత్రం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో కేవలం ఆంశిక గ్రహణం మాత్రమే కనిపించే అవకాశముంది.
ఎలా చూడాలి?
ఈ అరుదైన దృశ్యాన్ని సురక్షితంగా వీక్షించాలంటే, ఐఎస్ఓ 12312-2 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సోలార్ ఫిల్టర్ గ్లాసెస్ లేదా సోలార్ వ్యూయర్ తప్పనిసరిగా వాడాలి. సాధారణ కళ్లద్దాలు లేదా గాజులు వాడటం ప్రమాదకరం. పరోక్షంగా చూడటానికి పిన్‌హోల్ ప్రొజెక్టర్ వంటివి ఉపయోగించవచ్చు.
శాస్త్రీయ ప్రాముఖ్యత
ఈ సూర్యగ్రహణం సందర్భంగా, శాస్త్రవేత్తలకు సూర్యుని కరోనాను అధ్యయనం చేసే అరుదైన అవకాశం లభిస్తుంది. సాధారణంగా కరోనా కనిపించదు, కానీ గ్రహణం సమయంలో సూర్యుడి ప్రకాశం కప్పిపడడంతో ఇది పరిశీలనకు అనుకూలంగా మారుతుంది.
ఓ శతాబ్దంలో ఒకే అవకాశం!
ఈ గ్రహణం ఈ శతాబ్దంలో అత్యంత ప్రత్యేకమైన ఖగోళ సంఘటనగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. అందుకే, ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. ఈ గ్రహణం కన్నులతో కాక, జ్ఞాపకాలతో చూడాల్సిన దృశ్యం అని ఖచ్చితంగా చెప్పొచ్చు!
































