వేసవి కాలం వచ్చిందంటే చాలా ఇళ్లలో టాల్కమ్ పౌడర్ వినియోగం పెరిగిపోతుంది. చెమట వాసన తగ్గించుకోవడం, శరీరాన్ని తాజాగా ఉంచుకోవడం కోసం ఎక్కువ మంది దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే టాల్కమ్ పౌడర్ కేవలం ముఖం లేదా శరీరానికి రాసుకునే వస్తువే కాదు. ఇంటి పనుల్లోనూ, రోజువారీ చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన విధంగా వాడితే టాల్కమ్ పౌడర్ ఎన్నో సందర్భాల్లో సులభమైన పరిష్కారంగా మారుతుంది.

వేసవిలో జుట్టు త్వరగా జిడ్డుగా మారడం సాధారణమే. ప్రతిరోజూ హెయిర్ వాష్ చేయలేని పరిస్థితుల్లో టాల్కమ్ పౌడర్ డ్రై షాంపూ లా పనిచేస్తుంది. తలకు కొద్దిగా పౌడర్ వేసి దువ్వుకుంటే అదనపు ఆయిల్ తగ్గి జుట్టు తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు ఇది త్వరిత పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
బట్టలపై పడిన నూనె మరకలు తొలగించడంలో కూడా టాల్కమ్ పౌడర్ సహాయపడుతుంది. మరక పడిన వెంటనే కొద్దిగా పౌడర్ చల్లితే అది నూనెను పీల్చేస్తుంది. తర్వాత ఉతికితే మరక సులభంగా పోయే అవకాశం ఉంటుంది. అలాగే బూట్లలో వచ్చే దుర్వాసనను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగకరంగా పనిచేస్తుంది. రాత్రిపూట బూట్లలో కొద్దిగా పౌడర్ వేసి ఉంచితే తేమ తగ్గి దుర్వాసన కూడా తగ్గుతుంది.
బిగుతైన దుస్తులు వేసుకునే సమయంలో చర్మానికి రాపిడి ఏర్పడి ఇబ్బంది కలుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో ముందుగా టాల్కమ్ పౌడర్ రాస్తే చర్మంపై రాపిడి తగ్గి సౌకర్యంగా ఉంటుంది. వేసవిలో చెమట ఎక్కువగా వచ్చే వారికి ఇది మరింత ఉపశమనం ఇస్తుంది.
బీచ్‌లు లేదా జలపాతాల దగ్గరకు వెళ్లినప్పుడు ఒంటికి అంటుకున్న ఇసుకను తొలగించడంలో కూడా టాల్కమ్ పౌడర్ ఉపయోగపడుతుంది. చర్మంపై పౌడర్ చల్లి రుద్దితే ఇసుక త్వరగా వదిలిపోతుంది. హెయిర్ కట్ తర్వాత మెడకు అంటుకునే చిన్న వెంట్రుకలను తొలగించడానికి కూడా ఇది మంచి చిట్కాగా పనిచేస్తుంది.
అయితే టాల్కమ్ పౌడర్‌ను అతిగా ఉపయోగించకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మానికి ఇబ్బందులు ఉన్నవారు లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే వాడటం మంచిదని చెబుతున్నారు.



























