ఆధార్ తో పాన్ అనుసంధానం చేయని వారికి త్వరలో షాక్ ఇవ్వబోతోంది కేంద్రం. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరికను జారీ చేసింది. మార్చి 31 లోగా మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు జత చేయకపోతే… మీ పని అయిపోయినట్టే.. ఇప్పటికే పదే పదే గడువు పెంచుకుంటూ వచ్చిన ఐటీ శాఖ ఇక గడువు పెంచడం కుదరదు అని తేల్చి చెప్పింది. గడువులోపు జత చేయని పాన్ కార్డులు పని చేయవని తెలిపింది ఆదాయపు పన్ను శాఖ. మర్చి 31 చివరి అవకాశమని, జులై 1, 2017 నాటికి శాశ్వత ఖాతా నంబర్ ను పొందినవారు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) కింద తన ఆధార్ నంబర్ ను లింక్ చేసుకోవాలి.
మీ ఆధార్ కార్డు, పాన్ కార్డుతో జత చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అంటే మర్చి 31 లోపు మీరు లింక్ చేయకపోతే ఇక మీ పాన్ కార్డు ఎందుకు పనికిరాదు. ఇందుకోసం ఆదాయపు పన్ను నియమాలను సవరించి ఇన్ కం టాక్స్ రూల్స్ లో 114AAA చేర్చినట్టు తెలిపింది.
ఇదిలాఉంటే.. పాన్ తో ఆధార్ కార్డు లింకింగ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి… ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి.. ఆ పేజీలో ఎడమవైపు లింక్ ఆధార్ (LINK Aadhar) అనే లింక్ ను క్లిక్ చేయండి… ఆతరువాత ఆధార్ లింకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ పై భాగంలో “క్లిక్ హియర్ టు వ్యూ ద స్టేటస్” (clickhere to view the status) అనే లింక్ ను క్లిక్ చేయండి. ఆ తరువాతి పేజీలో మీ పాన్ మరియు ఆధార్ కార్డు నంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తరువాత “వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ (view link aadhar status)” అనే బటన్ ను క్లిక్ చేయండి. దీనితో మీ ఆధార్, పాన్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది. మీ పాన్ నంబర్, ఆధార్ తో లింక్ అయివుంటే అదే పేజీలో “మీ పాన్ ఆధార్ తో లింక్ అయింది” అని వస్తుంది.




























