ఎండలు మండుపోతున్నాయి.. ఏసీ లేకుండా గంట కూడా ఉండలేని పరిస్థితి. అయితే ఎలా వాడాలో తెలుసుకున్న తర్వాతే ఏసీ కొనడం మంచిది. లేకపోతే నెలకు వేల రూపాయల్లో బిల్లు వచ్చినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే మీ ఇంట్లో ఏసీ బిల్లు తగ్గించుకుని కూల్ గా ఉండే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏసి ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి
ఏసీ ఫిల్టర్లను వారానికోసారి అయినా తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ శుభ్రంగా ఉన్నట్టయితే గాలి విరివిగా కాయిల్స్ కు సరఫరా అవుతుంది. దాంతో గది వెంటనే చల్లబడుతుంది. దీంతో మీకు కరెంటు ఆదా అవుతుంది.

గదిలో ఎంత మేర ఉష్ణోగ్రత
ఏసీ టెంపరేచర్ 25-27 డిగ్రీల మధ్య ఉంచుకోవడం విద్యుత్ పొదుపు పరంగా మంచిది. దీనివల్ల గది చల్లబడడం, బిల్లు తగ్గడం రెండూ సాధ్యమవుతుంది. ఉష్ణోగ్రత 18 డిగ్రీలను సెట్ చేసుకోవడం వల్ల గదిలోని ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు తగ్గే వరకూ కంప్రెషర్ తిరుగుతూనే ఉంటుంది. దాంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. వేసవిలో బయటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైన ఉన్నప్పుడు గదిలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచాలంటే ఏసీ కంప్రెషర్ ఎంత కష్టపడాలో ఆలోచించండి. అందుకే ఆ సమయంలో విద్యుత్ వినియోగం అధికం అవుతుంది. 24 డిగ్రీలకు పైన టెంపరేచర్ ను సెట్ చేసుకోవడం ద్వారానే విద్యుత్ వినియోగాన్ని మీరు తగ్గించొచ్చు..

గది ఉష్ణోగ్రత చల్లబడేందుకు..
గది ఉష్ణోగ్రత చల్లబడేందుకు.. ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయి. గది విస్తీర్ణం, కిటికి ఎంత పరిమాణంలో ఉంది, దానికి అద్దాలు ఎంత మేర ఉన్నాయి, గదిలో ఉన్న ఫ్లోరింగ్, తూర్పు లేదా పడమర దిక్కులో ఆ గది ఉందా, గదిలో టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఎన్ని ఉన్నాయి, గదిలోకి వేడి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలు, గదిలో ఎంత మంది ఉన్నారు ఈ అంశాలన్నీ గదిలోని ఉష్ణోగ్రత, చల్లబడే అంశాలను ప్రభావితం చేస్తాయి..

సీలింగ్ ఫ్యాన్ అవసరమా?
గదిలో ఏసీ ఆన్ చేసి ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ ను కూడా ఆన్ చేయడం సాధారణంగా చాలా మంది చేస్తుంటారు. దీనివల్ల ఏసీ నుంచి వచ్చే చల్లదనం గది అంతా వ్యాపిస్తుందని వారు భావిస్తారు. కానీ, సీలింగ్ ఫ్యాన్ కారణంగా గది పైకప్పు నుంచి వేడి కిందకు వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల మరింత చల్లదనం అవసరపడుతుంది. పైగా సీలింగ్ ఫ్యాన్ ను ఆన్ చేసి ఉంచడం వల్ల గదిలో ఉన్న దుమ్ము గది అంతా వ్యాపిస్తుంది. దీంతో ఆ దుమ్ము ఏసీ ఫిల్టర్లలోకీ చేరుతుంది. ఏసీ ఉన్న గదిలో రోజూ వెట్ క్లాత్ తో తుడుచుకోవాలి.

తరచూ ఏసీని ఆన్, ఆఫ్ చేయవద్దు
ఏసీని తరచూ ఆన్, ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. ఇలా ఆన్ ఆఫ్ చేసుకోవడం కాకుండా గదిలో ఉష్ణోగ్రత 25-27 డిగ్రీల మధ్య సెట్ చేసి ఉంచుకోవచ్చు. దీనివల్ల తక్కువ స్థాయిలో చల్లదనం విడుదలవుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఆఫ్ చేసేస్తే గదిలో ఉన్న చల్లదనం అంతా ఆవిరైపోతుంది. కొంత సేపటికి ఆన్ చేస్తే తిరిగి గదిని చల్లబరిచేందుకు వీలుగా ఏసీ కంప్రెషర్ అధిక వేగంతో ఎక్కువ సమయం పాటు తిరుగుతుంది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఈ అవసరం లేకుండా ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలు వస్తున్నాయి. ఈ టెక్నాలజీలో గదిలో ఉష్ణోగ్రత చల్లబడిన తర్వాత కూడా కంప్రెషర్ ఆగకుండా తక్కువ వేగంతో తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల అధిక విద్యుత్ వినియోగం అవసరం ఏర్పడదు.

కరెంటు బిల్లు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించాలి:
* గది తలుపులు ఊరికే తీయొద్దు. ఇలా తెరిచిన ప్రతీసారీ బయటి నుంచి వేడి గాలి లోపలికి చొరబడుతుంది. దాంతో ఏసీ ఎక్కువ సేపు పనిచేయాలి.
* విండో ఏసీ కంటే స్ల్పిట్ ఏసీ సూచనీయం. ఎందుకంటే వేడి గాలి తేలికగా ఉంటుంది. దాంతో అది గదిలో ఫై భాగంలోకి చేరుతుంది. స్ల్పిట్ ఏసీ గోడకు పై భాగంలో బిగించేది కనుక గాలి తొందరగా చల్లబడుతుంది.
* తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనే ముందే పవర్ ఇన్ పుట్ చూడండి. సాధారణంగా ఒక టన్ను ఏసీకి 5 స్టార్ రేటింగ్ ఉన్నవి 930 యూనిట్ల నుంచి 980 యూనిట్ల వరకు వినియోగించుకుంటాయి.

* ఏసీ ఇండోర్ యూనిట్ కు వీలైనంత తక్కువ దూరంలో అవుట్ డోర్ యూనిట్ (కంప్రెషర్)ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, రెండు యూనిట్ల మధ్య ట్యూబుల ఇన్సులేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి.
* ఏసీని గది మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే గది అంతా చల్లగాలి సమంగా పంపిణీ అవుతుంది.
* ఏసీని ఆన్ చేసిన తర్వాత వేగంగా చల్లబడాలని ముందు 16 డిగ్రీల్లో ఉంచేసి తర్వాత తగ్గించడం సరైన ఆలోచన కాదు. విద్యుత్ ఆదాను కోరుకుంటే ఇలా చేయకుండా ముందు నుంచీ ఒకటే ఉష్ణోగ్రతలో ఉంచాలి. కాకపోతే గది చల్లబడేందుకు కొంచెం సమయం పడుతుంది.

* విండోలు, తలుపులు సహా ఏ మార్గంలోనూ ఏసీ లీకేజీ లేకుండా చూసుకోవాలి. విండో ఉండి, దానికి గ్లాస్ లు ఉంటే కర్టెన్ తప్పనిసరిగా బిగించుకోవాలి. లేకపోతే గదిలోకి వేడి వస్తుంది.
* ఏసీ ఉన్న గదిలో సీలింగ్ తప్పనిసరి. గదిపైన మరో ఫ్లోర్ లేకపోతే కూల్ సెమ్ కోటింగ్ వేసుకోవడం వల్ల గదిలోకి ఉష్ణోగ్రత ప్రవేశించడం చాలా వరకు తగ్గిపోతుంది.



























