గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం 40 రోజుల మృత్యు పోరాటం తర్వాత తీవ్ర అనారోగ్యంతో శుక్ర‌వారం మృతి చెందిన విష‌యం తెలిసిందే. అద్భుత‌మైన గాయ‌కుడిగా 45 వేల‌కు పైగా పాట‌లు పాడి అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన బాలు త‌న పాట‌ల‌తో ఆబాల గోపాలాన్ని ఓల‌లాడించారు. త‌న గాన మాధుర్యంతో త‌న్మ‌య‌త్వంతో మైమ‌రిచిపోయేలా చేశారు. అలాంటి మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తికి భార‌త ర‌త్న ఇవ్వ‌డం స‌ముచితం అని హీరో యాక్ష‌న్ కింగ్ అర్జున్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. బాలు ఓ చరిత్ర. ఆయన గాత్రం అజరామరం. ఆయన సాధించిన విజయాలు అసమానం. తన రంగంలో ఎస్పీ బాల సుబ్రమణ్యంను మించిన వ్యక్తి లేరు. ఐదున్న‌ర ద‌శాబ్దాల సినీ ప్ర‌స్థానంలో బాలు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో దాదాపు 45 వేల‌కు మించి పాట‌లు పాడారు. ఇది ఓ గాయ‌కుడిగా ఆయ‌న సాధించిన రికార్డ్‌. సాధారణంగా రోజుకు 4,5 పాటలు విన్నా ఇక చాలు అనిపిస్తుంది. కానీ బాలు పాట అలా కాదు విన్న కొద్దీ మ‌ధురంగా శ్రావ్యంగా వుంటూ ఇంకా ఇంకా వినాలనిపించేలా ఆయన గాత్రం మనలను మైమ‌ర‌పింప‌జేస్తుంది. అందుకే బాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు బాలు ఫాన్స్. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలోకి ప్రముఖ సీనియర్ హీరో అర్జున్ కూడా ఎంటరయ్యారు.

బాల సుబ్రమణ్యం అంత్యక్రియల్లో పాల్గొన్న అతికొద్ది మంది ప్రముఖుల్లో అర్జున్ ఒకరు. ఈ సందర్భంగా బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందేనంటున్నాడు మన యాక్షన్ కింగ్ అర్జున్. బాలును ఎప్పుడు కలిసినా తనలో ఏదో తెలియని ఉత్సాహం, ఎనర్జీ వచ్చేదని గుర్తుచేసుకున్న అర్జున్.. బాలును గ్రేట్ సింగర్ అనే కంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనడానికే తాను ఇష్టపడతానంటున్నాడు. బాలు అంత్యక్రియల్లో అర్జున్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, దేవిశ్రీప్రసాద్, భారతీరాజా లాంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరి మన ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యంకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మ శ్రీ.. 2011లో పద్మభూషణ్ సత్కారాలతో పురస్కరించింది. తాజాగా బాలుకి భారతరత్న కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న హీరో అర్జున్ ఈ డిమాండ్‌ని ఎంతవరకూ ముందుకు తీసుకువెళ్తారో.. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మన్నిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here