సీనియర్ హీరోయిన్ లతా శ్రీ గురించి ఈతరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. అప్పటి ప్రేక్షకులకు లతాశ్రీ సుపరిచితమే. తన సినీ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత చెల్లెలి పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ‘యమలీల’ ‘నెంబర్ వన్’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి హిట్ చిత్రాల్లో ఈమె నటించింది. ముఖ్యంగా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో “జెండా ఎత్తేస్తా” అనే డైలాగ్ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈమె తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల ద్వారా లతాశ్రీ ప్రేక్షకులను మెప్పించారు. లతాశ్రీ అసలు పేరు ‘పద్మలత’ .. సినిమాల్లోకి వచ్చాక ‘శ్రీలత’గా మార్చారు. ఆ తరువాత ‘లతాశ్రీ’ అని మార్చుకుంటే కలిసొస్తుందని ఒక సిద్ధాంతి చెబితే అలా మార్చుకుంది. నిజంగానే అప్పటి నుంచి అవకాశాలు పెరిగాయి.

మొదటి నుంచి లతాశ్రీకి డాన్స్ , నటన అంటే ఇష్టం. విజయవాడలో పదో తరగతి చదువుతుండగానే తమ్మారెడ్డి భరద్వాజాగారి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైన తరువాత ‘పోలీస్ భార్య’లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఇక కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు లతాశ్రీ. 1990లో జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లాడిన లతా శ్రీ.. ఆ తరువాత నటనా రంగానికి స్వస్తి చెప్పేసింది. లతాశ్రీ చివరిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి’ అనే చిత్రంలో నటించింది.

ఇదిలా ఉండగా.. ‘పోలీస్ భార్య’ అనే హిట్ చిత్రంలో ఓ బోల్డ్ పాత్ర పోషించింది లతా శ్రీ. ఆ చిత్రం 100 రోజుల ఫంక్షన్లో లతాశ్రీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. ఆ సంఘటన గురించి లతా శ్రీ మాట్లాడుతూ.. “సాధారణంగా నాకు కొంచెం కోపం ఎక్కువ. ‘పోలీస్ భార్య’ సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతున్న రోజు నాకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఆ రోజుల్లో ఆర్టిస్ట్‌లు పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. ఆ ఫంక్షన్ కు పెద్ద మొత్తంలో జనం వచ్చారు. ఆర్టిస్ట్‌లు అందరం కలిసి వెళ్తుంటే..
ఒకడు వచ్చి నా నడుముని గిల్లేశాడు. నాకు చాలా కోపం వచ్చి వాడివైపు చూసాను.. అయినా సరే మళ్లీ ఏదో చెయ్యడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు వాడి చేయి పట్టుకుని ఒక్కటిచ్చాను. వెంటనే వాడు అక్కడ నుండీ వెళ్లిపోయి ఓ పదిమందిని వెంటేసుకుని వచ్చాడు. ‘ఏంటి మావాడ్ని కొట్టావ్’ అంటూ వాళ్ళు నా మీదికి వస్తుంటే.. ఆ టైం లో నా ప్రక్కనే ఉన్న హీరో నరేష్ గారు వాళ్లను కొట్టి వెనక్కి నెట్టేసి.. వెంటనే పోలీసుల్ని పిలిచించారు. తరువాత ఆయనే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వ్యాన్ ఎక్కించి ఇంటికి పంపారు. ఆ సంఘటనతో హీరో నరేష్ గారు రియల్ హీరో అనిపించుకున్నారు.” అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లతాశ్రీ.



























