Actor Sharath Babu : విలక్షణ నటుడు విలన్ గాను, హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదాలవలసలో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకోక చిలుక, చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981, 88, 89 మూడు సార్లు ఉత్తమం సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న శరత్ బాబు గారి గురించి అయన బాల్య మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

బాల్యంలో కష్టాలు పడ్డాడు…
శరత్ బాబు గారు ఆముదాలవలసలో తన కుటుంబంతో ఉండేవారు. ఆయన పక్కింట్లోనే ఉండే ఆయన స్నేహితుడు సత్యనారాయణ గారు ఆయన గురించి మాట్లాడారు. శరత్ బాబూ స్వస్థలం కాన్పూర్ కాగా జీవనం కోసం ఆముదాలవలస వచ్చారు. మొత్తం పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు ఉండేవారట శరత్ బాబు గారి ఇంట్లో. మొదట్లో రైల్వే కాంటీన్ తీసుకుని పనిచేసేవారట. ఆపైన సొంతంగా హోటల్ పెట్టుకుని జీవనం సాగించేవారంటూ శరత్ బాబు కుటుంబ నేపధ్యం గురించి తెలిపారు సత్యనారాయణ. ఇక ఒకవైపు హోటల్లో కష్టపడుతూనే మరోవైపు చదువుకుంటూ ఉన్న శరత్ బాబు నటన మీద ఆసక్తితో డ్రామాలలో నటిస్తూ ఉండేవారట. అలా సినిమాలవైపు వెళ్లారంటూ ఆయన స్నేహితుడు సత్యనారాయణ తెలిపారు.

ఇక సినిమాల్లోకి వచ్చాక శరత్ బాబు తనకంటే నాలుగేళ్లు పెద్ధ అయిన సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారు పదనాలుగేళ్ల తరువాత విడాకులతో వేరయ్యారు. శరత్ బాబు గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ ఇలా పలు ఇతర భాషలలోనూ నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తండ్రి పాత్రలలోనూ ఒదిగిపోయారు. ఇక కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా రాక ముందు ఒకసారి ఆముదాలవలస వచ్చి తాను బాల్యంలో ఉన్న ఇంటిని అలాగే తన స్నేహితులను కలిసి వెళ్లారట శరత్ బాబు.

































