2000 సంవత్సరం ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా రిలీజ్ అయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఆ సినిమాలో జంటగా నటించిన పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ఆ తర్వాత నిజజీవితంలో దంపతులు అయ్యారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అది వేరే విషయం… కానీ, బద్రి సినిమా కంటే ముందు తమ్ముడు చిత్రంతో యూత్‌లో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అమ్మాయిలు కూడా పవన్ కళ్యాణ్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. అందులో మాధవీలత కూడా ఒకరు.

మాధవీ లత.. తనీష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘స్నేహితుడా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలా కొన్ని సినిమాల్లో నటించిన మాధవీ లత తెలుగు సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. విశేషమేమిటంటే.. ఇంతవరకూ మాధవీలత పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఫ్లెక్సీలు కడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోయిన దుర్ఘటనపై హీరోయిన్ మాధవీలత స్పందిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘ఈ సంఘటన చాలా బాధకరమైన అంశం.. మనం చాలా రోజుల నుంచి ఇలాంటి దుర్ఘటనలు చూస్తూనే ఉన్నాం.. తమ అభిమాన హీరో సినిమా విడుదలైన మొదటిరోజు టిక్కెట్ల కోసం కొట్టుకుని చనిపోయేవాళ్లను, అలాగే ఆడియో ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లలలోనూ.. ఎంతో మంది ఫాన్స్.. చనిపోతూ ఉన్నారు. కాబట్టి.. దయచేసి.. జాగ్రత్తగా ఉండండి. మీకు మీ హీరో అంటే చాలా ఉత్సాహం ఉండొచ్చు.. చుట్టూ ఏం జరుగుతుందన్న విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. మీతో పాటు మీ కుటుంబం కూడా ఇబ్బందులకు గురౌతుంది. అలాగే మీరు ఎంతగానో ఇష్టపడే హీరోలు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఎవరూ కూడా తనకోసం ఒకరు చనిపోవాలని కోరుకోరు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయితే అసలు కోరుకోరు. అంత పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టమని పవన్ కళ్యాణ్ అడగలేదు. మీ అభిమానం గుండెల్లో ఉండాలి తప్ప.. ఆ గుండె ఆగిపోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మీరు అభిమానంతోనే చేస్తున్నారు కాని.. ఆయనకు చెడ్డ పేరు తీసుకువస్తుంది.

ఏ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ తొక్కిసలాటలో చనిపోయినా అది ఆ హీరోకే చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని అన్ని పార్టీలు టార్గెట్ చేసి ఉన్నారు. మీ అభిమానులందరికీ నా విన్నపం ఏమిటంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.. మీరు దూరమైతే మీ కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారు. ఒకే ఇంట్లో ఇద్దరు సోదరుల్ని కోల్పోతే ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలం. కర్మ సిద్దాంతం ప్రకారం మృత్యువు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఇంట్లో కూర్చున్నా చనిపోయే అవకాశం ఉంది. అది మన తలరాత. కాని మనిషికి ఒక ఆశ ఉంటుంది.. ఇలా జరగకుండా ఉంటే బాగుండు అని. దయచేసి ఇకపై మీరు అభిమానించే హీరోలకు ఫ్లెక్సీలు కట్టొద్దు. ఆ డబ్బుతో పేదవారికి సాయం చేయండి. ఏ హీరో కూడా ఫ్లెక్సీలు కట్టమని అడగడు. 25 అడుగుల ఎత్తు నుంచి పడి చనిపోవడం అంటే దారుణం. ఇకపై ఫ్యాన్స్ ఇలాంటి ప్రమాదరకమైన పరిస్థితులు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి.. ప్రాణహాని చేసుకోవద్దు’ అంటూ తన ఫీలింగ్స్ ని షేర్ చేశారు బీజేపీ లీడర్, హీరోయిన్ మాధవీలత.



























