Actress Yamuna : యమున దక్షిణాది సినిమా నటి. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడమే కాక కన్నడ, మలయాళ, తమిళ భాషా సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో నటించింది. ఈమె కర్ణాటకకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చింది. ఈమె అసలు పేరు ప్రేమ. దర్శకుడు కె.బాలచందర్ ఈమె పేరును యమునగా మార్చాడు. యమున కన్నడ సినిమా మోడద మరెయల్లిలో శివరాజకుమార్ సరసన తొలిసారి నటించింది.ఈమె సుమారు 50 తెలుగు, కన్నడ చిత్రాలలో కథానాయికగా నటించింది.

1989లో విడుదలైన మౌన పోరాటం సినిమా ద్వారా ఈమె పేరుగడించింది. ఈ సినిమా మీడియాలో ప్రాచుర్యం పొందిన ‘సబితా బధేయి’ అనే ఆమె వాస్తవగాధ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాలో ఈమె ఒక ప్రభుత్వోద్యోగి చేత మోసగింపబడి, వైవాహిక హక్కులకోసం, తన అక్రమ సంతానానికి సరైన గుర్తింపు కోసం పోరాడే యువతి గౌరి పాత్రను ధరించింది. ఈమె తరువాత వినోద్ కుమార్ సరసన మరో అవార్డు చిత్రం మామగారులో నటించింది. తరువాత పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలను ధరించింది. ఈమె వివాహం తరువాత కొంతకాలం సినిమాలలో నటించడం మానివేసింది. కొంత విరామం తరువాత టి.వి.సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఈటీవిలో ప్రసారమైన ధారావాహిక అన్వేషితలో ఈమె నటించింది.

అయితే యమునా ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ..1989 లో వచ్చిన “మౌన పోరాటం” చిత్రంలో హీరోగా నటించిన వినోద్ కుమార్ నాకంటే పొడుగ్గా ఉంటారు. ఆ చిత్రంలో కొన్ని క్లోజ్ గా ఉండే సన్నివేశాలలో నేను ఒక స్టూల్ వేసుకుని నటించే దానిని.. ఆ తర్వాత 1990లో విడుదలైన “అల్లుడుగారు” చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ పోషించిన గెస్ట్ రోల్ కోసం ముందుగా నన్నే సంప్రదించారు. కానీ అది గెస్ట్ రోల్ కావడం, పైగా నా డేట్స్ కూడా అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా అవకాశాన్ని నేను వదులుకున్నాను. ఆ తరువాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ చిత్రాలలో నేను నటించలేకపోయాను. ఒకవేళ ఆ సినిమాలో నటిస్తే.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చుండేది. నా సినిమా భవిష్యత్తు కూడా మరోలా ఉండేదని ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు.
































