అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక సాధారణ మహిళ జీవితం, విదేశీ నేలపై అసాధారణమైన మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. రాజోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మట్టా ఆదిలక్ష్మి కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. ఉపాధి కోసం దాదాపు నలభై ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్లిన ఆమె, అక్కడ ఓ కుటుంబానికి సేవ చేయడమే కాకుండా, వారి జీవితాల్లో విడదీయరాని భాగంగా మారడం విశేషం.

1977లో ఉపాధి కోసం ఖతార్ దేశంలోని దోహాకు వెళ్లిన ఆదిలక్ష్మి, మొదట ఓ అరబ్ కుటుంబంలో పనిమనిషిగా చేరారు. అయితే కాలక్రమేణా ఆమె పాత్ర ఆ ఇంట్లో పూర్తిగా మారిపోయింది. కుటుంబంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఇంటి యజమాని భార్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించడంతో, చిన్న చిన్న పిల్లల బాధ్యతలు అన్నీ ఆదిలక్ష్మిపై పడిపోయాయి.
ఏడుగురు చిన్నారులను తన సొంత పిల్లలుగా భావించి, ఆదిలక్ష్మి వారిని ప్రేమతో పెంచారు. ఆప్యాయత, శ్రద్ధతో వారిని చూసుకుంటూ, వారికి తల్లిలా మారిపోయారు. ఈ అనుబంధం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడింది. ఆ కుటుంబంలోని పిల్లలు ఆమెను పనిమనిషిగా కాదు, తమ తల్లిగా భావించడం ప్రారంభించారు.
ఇంతలో కుటుంబ సభ్యులతో ఏర్పడిన అనుబంధం కారణంగా, 2007లో ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అయినప్పటికీ, స్వగ్రామంతో ఆమె అనుబంధం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో సంబంధాలు కొనసాగిస్తూ, ప్రతి ఏడాది స్వదేశానికి వచ్చి వారిని కలిసేవారు.
దాదాపు 47 సంవత్సరాల పాటు అదే కుటుంబానికి సేవలందించిన ఆదిలక్ష్మి, ఈ నెల 5వ తేదీన గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆమెను తమ తల్లిగా భావించిన ఆ కుటుంబ సభ్యులు, ఆమెకు అపూర్వమైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరినా, ఖతార్‌లోని ఆ కుటుంబం భావోద్వేగానికి లోనైంది. “ఆమె మీ తల్లి మాత్రమే కాదు, మా తల్లీ కూడా” అంటూ ఆమెను తమ దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, తమ సొంత తల్లి సమాధి పక్కనే ఆమెకు సమాధి నిర్మించారు.
ఒక విదేశీ మహిళకు ఇలాంటి గౌరవం దక్కడం అరుదైన విషయం అని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో చింతలపల్లి గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంటి ముందు ఆమె ఫోటోను ఉంచి కన్నీటి నివాళులు అర్పించారు.
సాధారణ జీవితం నుంచి ప్రారంభమైన ఆదిలక్ష్మి ప్రయాణం, చివరికి ఓ కుటుంబానికి తల్లిగా మారి, అదే కుటుంబం మధ్య శాశ్వత నిద్రలోకి జారుకోవడం ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తోంది. మానవ సంబంధాలు సరిహద్దులను దాటి ఎంత బలంగా ఉండగలవో ఆమె జీవితం మరోసారి గుర్తు చేసింది.



























