ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ సైనికుడిని, పౌరుడిని కూడా వదలకుండా దాడులు చేస్తున్నారు. ఏకంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడూ దేశం విడిచి అమెరికా పారిపోయారంటే… ఆ దేశంలో ప్రజలకు రక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతలా వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి.

ఇలా ఉగ్రవాదులకు దేశ సైన్యం మోకరిల్లడం అనేది బహుశా ఎక్కడా చూసివుండం. ఆప్ఘనిస్తాన్‌లో అది జరిగిపోయింది. ఇప్పడు ఆప్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాంటి వారున్న దేశంలో వ్యాపార, వాణిజ్యాలు నెరపడం కష్టం. అందువల్ల ఇండియాకి ఆప్ఘనిస్థాన్ నుంచి ఇప్పుడు కొన్ని రకాల వస్తువుల దిగుమతులు ఆగిపోతాయి. ఫలితంగా వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అటువంటి వస్తువులు ఏంటో చూద్దాం. అందులో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్. ఆ దేశం చాలా రకాల డ్రైఫ్రూట్స్‌ని ఇండియాకి దిగుమతి చేస్తోంది.
అందులో కూడా ముఖ్యంగా ఎండు ద్రాక్ష అక్కడి నుంచి పెద్ద ఎత్తున భారత్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి ధర విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఇంగువ, జీలకర్ర , ఔషధాల్లో వాడే తొక్కలు, చర్మాలు, కొన్ని రకాల మందులు, మూలికలు, మొక్కలు, ఔషధ మొక్కలు, ఔషధ నూనె గింజల వంటి వాటిని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వీటి దిగుమతి ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో అవి మన దేశంలో విపరీతంగా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా జీలకర్ర ఇప్పటికే చాలా ధర ఉంది. అది ఇంకా పెరగడం ఖాయం. తాలిబన్లతో మరో ముప్పు కూడా ఉంది. వారు ఒకే దగ్గర కుదురుగా ఉండరు. చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా వారి కన్ను పడుతుంది. అలా… గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాద సమస్య పెరుగుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి రేగినా… అది ఇండియాకి పెద్ద దెబ్బే అవుతుంది. దీని ప్రభావం బంగారంపై కూడా పడే అవకాశం ఉంది.































