ఒకప్పుడు తెలుగు టెలివిజన్‌లో యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, ఇప్పుడు తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె టీవీ పరిశ్రమలోని చీకటి కోణాలపై బాంబు పేల్చారు. రియాల్టీ షోల వెనుక ఉన్న నిజాలను నిర్మొహమాటంగా బయటపెట్టారు.

‘షోలో తిట్టుకోవడం, కొట్టుకోవడం అన్నీ స్క్రిప్టెడే’
“మీరు చూసే టీవీ రియాల్టీ షోలు ఏవీ నిజం కావు. అక్కడ జరిగే గొడవలు, భావోద్వేగాలు, చివరికి నవ్వులు కూడా ముందే రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతాయి” అని ఉదయభాను స్పష్టం చేశారు. అంతేకాకుండా, “షోలో ఎక్కడ తిట్టాలో, ఎక్కడ నవ్వాలో కూడా వాళ్లే మైక్ లేదా ఇప్పుడు వాడుతున్న మౌత్ స్పీకర్ ద్వారా చెప్తారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
పారితోషికాలు ఇవ్వలేదని, చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆవేదన
తాను గతంలో ఎన్నో రియాల్టీ షోలు చేసినప్పటికీ, అందులో ఉండే కృత్రిమత్వం నచ్చక వాటిని మానేశానని ఉదయభాను తెలిపారు. “ఇలాంటి షోలు ఎందుకు చేశానో అని ఇప్పటికీ బాధపడుతుంటాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, పలు షోలకు తనకు కనీసం పారితోషికం కూడా ఇవ్వలేదని, కొందరు నిర్మాతలు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, ఆ బౌన్స్ అయిన చెక్కులు ఇప్పటికీ తన దగ్గర ఉన్నాయని చెప్పారు.
ఇండస్ట్రీలో కుట్రలు, అవకాశాలు కోల్పోయిన వైనం
తనను ఇండస్ట్రీలో చాలామంది తొక్కేయడానికి ప్రయత్నించారని, షోల మధ్యలోనే తనను బయటకు తీసేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని ఆమె భావోద్వేగంతో పంచుకున్నారు. సినిమా ఈవెంట్లకు అవకాశం ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో తీసేసేవాళ్లు ఉన్నారని కూడా ఆమె ఆరోపించారు.
త్వరలోనే ఇండస్ట్రీలో తనపై జరిగిన కుట్రలన్నింటినీ బయటపెడతానని ఉదయభాను హెచ్చరించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు టెలివిజన్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.





























