ముంబై: భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)’ కార్యక్రమం 17వ సీజన్‌తో త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ సీజన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగడం లేదంటూ ఇటీవల వచ్చిన వార్తలకు సోనీ టీవీ తెరదించింది. సీజన్ 17కి మరోసారి అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

కేబీసీ – అమితాబ్ బచ్చన్ ఒక బంధం
దాదాపు పదేళ్లుగా ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్, తన ప్రత్యేకమైన హోస్టింగ్ స్కిల్స్‌తో కేబీసీని మరింత పాపులర్ చేశారు. అమితాబ్ అంటే కేబీసీ.. కేబీసీ అంటే అమితాబ్ అనేలా ఆయన ఓ ప్రత్యేక ముద్ర వేశారు. ఒకప్పుడు సినీ పరిశ్రమలో వరుస ఫ్లాపులతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బిగ్‌బీ, కేబీసీ ద్వారానే మళ్లీ ప్రజలకు దగ్గరయ్యారు. దేశంలోని మారుమూల గ్రామాల వరకు అమితాబ్ క్రేజ్‌ను విస్తరించడంలో ఈ షో ప్రధాన పాత్ర పోషించింది. కుటుంబానికి ఆర్థికంగా నిలబడటంలోనూ ఈ షో ఎంతో మద్దతుగా నిలిచింది. ఈ షో ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం వినోదాత్మక షో మాత్రమే కాదు. విజ్ఞానం, వినోదం, స్ఫూర్తి అన్నీ కలిపిన ఒక సమ్మిళితమైన కార్యక్రమం.
ఈ కార్యక్రమం స్ఫూర్తిగా తెలుగు భాషలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో తెరకెక్కించబడింది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. కానీ, హిందీలో కేబీసీ పొందిన స్థాయిలో ఆదరణ ఈ షోకు దక్కలేదు.
కొత్త సీజన్ వివరాలు, బిగ్‌బీ రెమ్యునరేషన్
ఇప్పటి వరకు కౌన్ బనేగా కరోడ్‌పతి 16 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఇప్పుడు 17వ సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అమితాబ్ స్థానంలో ఐశ్వర్యరాయ్ లేదా మాజీ క్రికెటర్ ధోనీ షోను నడిపించనున్నారన్న రూమర్స్ బయటకొచ్చాయి. అయితే, ఈ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ, ఆగస్ట్ 11వ తేదీ నుంచి ఈ షో ప్రారంభమవుతుందని సోనీ టీవీ ప్రకటించింది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ మరియు సోనీ లివ్ ప్లాట్‌ఫారంలో ప్రసారం అవుతుంది.
ఇక ఈ షో కోసం అమితాబ్ బచ్చన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న దానిపై బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. లీకైన సమాచారం ప్రకారం, అమితాబ్ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారట. మొత్తం సీజన్‌లో ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయో ఆధారపడి బిగ్‌బీకి అందే మొత్తం కోట్లు కోట్లలో ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారికంగా ఇది ఎంతవరకు నిజమో త్వరలోనే తెలుస్తుంది.
ఈ కొత్త సీజన్‌తో అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెరపై మాయ చేస్తారా? మీ అంచనాలు ఏమిటి?






























