Ammo Okato Thaareekhu : ప్రేక్షకులను కొన్ని సినిమాలు ఊహాజనిత జీవితంలోకి తీసుకువెళ్లి విహరింప చేస్తాయి. మరికొన్ని నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబిస్తూ వచ్చిన ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రం ప్రతి మధ్యతరగతి వ్యక్తిని ఆలోచించేలా చేస్తుంది. అడుక్కుతిను లేదా అంబానీ లా బతుకు అంతేకానీ మధ్యతరగతి వాడిలా బతుకకు అన్న విధానం ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది. మధ్యతరగతి ఉద్యోగికి ఒకటో తారీకు వచ్చే జీవితం తన జీవితంలో వచ్చే సూర్యోదయం లాంటిది కానీ అది ఎంతో సేపు ఉండదు.. పదో తారీకు వచ్చేసరికల్లా తన జీతం సూర్యాస్తమయంలా మాయమైపోతుంది.

ఇలాంటి పరిస్థితులను కేంద్ర బిందువుగా తీసుకొని దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని మలచిన విధానం ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టేల చేస్తుంది. ఈ సినిమాలో ఆర్ టి సీ డ్రైవర్ గా, మధ్యతరగతి బాధితుడి పాత్రలో గోవిందారావుగా ఎల్బీ శ్రీరాం నటించిన విధానం బాగుంటుంది. ప్రతి నెలలో వచ్చే ఒకటో తారీకు మధ్యతరగతి ఉద్యోగికి ఎంత ఇష్టంగా ఉంటుందో అంత కష్టంగా కూడా ఉంటుంది. ప్రతి మనిషికి పది వేల్లిచ్చింది.. పని చేసుకుని బతకమని పదిమందికి సహాయపడమని.. అలాంటి గోవిందరావుకు ఒక కొడుకు ముగ్గురు కూతుర్లతో జీవితంలో ఎన్నో డక్కా మొక్కిలు తింటూ.. తన మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తాడు. చేతికి అందొచ్చిన కొడుకు జల్సాలు చేస్తూ మధ్యతరగతి జీవితాన్ని మరిచిపోయి ఆకాశానికి నిచ్చెనలేస్తూ జల్సాగా తిరుగుతుంటాడు.

అలాగే తన రెండో కూతురు చిరు ఉద్యోగిగా వేన్నిల్లకు చన్నీళ్ల అన్నట్టుగా తండ్రికి సహాయకారిగా ఉంటుంది. అందరికంటే పెద్దమ్మాయి మొగుడు వదిలేయడంతో ఇంటి మీదే ఉంటూ కాలం వెళ్ళదీస్తూ ఉంటుంది. చిన్న అమ్మాయి చదువు, పెద్ద అమ్మాయి బరువు మోయలేక ఎల్బీ శ్రీరామ్ నానాయాతన పడుతుంటాడు. ఇంటిని అమ్మాడంటూ కోర్టులో కేసు దాఖలైన సందర్భంలో ఎల్బీ శ్రీరామ్ చెప్పిన సంభాషణ.. మధ్య తరగతివాడిగా పుట్టడం నేను చేసిన పెద్ద తప్పు,పెళ్లి చేసుకోవడం మరో తప్పు, ఇంటి నిండా పిల్లల్ని కనడం మరో తప్పు.. నేనే కాదు నాలాగ ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు ఇదే తప్పు చేస్తున్నారు..

బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు.. పెరిగిన ధరలు,తరగని బాధలు.. నీల్లవాడికి, పాలవాడికి రెంట్ కి,కరెంటుకి, రేషన్ కి, పండక్కి పబ్బానికి.. ఇలా అన్నిటికీ ఒకటో తారీకు. ఆ ఒకటో తారీకు కోసం 30 రోజులు ఎదురు చూస్తాం సార్.. అది కాస్త ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది.. సార్ ఒకటో తరగతి వాడికి రెండో తరగతి, రెండో తరగతి వాడికి మూడో తరగతి ఎదుగుదల ఉంటుంది సార్. కానీ ఒక్క మధ్యతరగతి వాడికే ఎదుగుదల ఉండదు సార్ అంటూ.. ఎల్బీ శ్రీరాం చెప్పిన సంభాషణ కోర్టు మొత్తం దద్దరిల్లేలా చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రేక్షకుడు ఊపిరి బిగ పట్టుకొని కుర్చీలో కూర్చున్నారనడంలో సందేహం లేదు.
































