Analyst Damu Balaji : సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గత ఏడాది మే 28న మొదలు పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అలా ఇటీవల విజయవాడలో జరిగిన శత జయంతి వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు. తాజాగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగగా సినిమా పరిశ్రమ నుండి తారలు, అలాగే రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. అయితే ఎన్టీఆర్ కుటుంబం నుండి కూడా హాజరైన ఎన్టీఆర్ మనవడిగా సినిమాల్లో సత్తా చాటుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలలో కనిపించకపోవడం నందమూరి అభిమానులకు బాధ కలిగించింది. అసలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ వేడుకలకు రాకపోడానికి గల కారణాలు ఇవి అంటూ ఎవరి వాదన వారు వినిపిస్తుండగా తాజాగా తప్పంతా ఎన్టీఆర్ దే అన్నట్లుగా టీడీపీ నేత జనార్దన్ మాట్లాడటం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఎన్టీఆర్ ని పిలిచాం… ఆయనే రాలేదు…
టీడీపీ సాంస్కృతిక శాఖ నేత జనార్దన్ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ ను సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణతో కలిసి వెళ్లి పిలవగా ఆయన తన పుట్టినరోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు ముందుగానే ఫిక్స్ చేసిన కార్యక్రమం అని రాలేనని చెప్పారని తెలిపారు. అయినా శత జయంతి ఉత్సవాలకు పిలవాలని కొన్ని నెలల ముందే ఆయన అపాయింట్మెంట్ అడిగినా ఆయన ఇవ్వలేదని, ఇప్పుడు ఇచ్చారని ఇప్పుడు ఇలాంటి ఒక కారణం చెప్పారని జనార్దన్ తెలిపి తప్పంతా ఎన్టీఆర్ దే అన్నట్లు చెప్పారని అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు. నిజానికి వేడుకలకు ఎన్టీఆర్ ను పిలవడం చంద్రబాబు ట్రాప్ అంటూ చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్ వేడుకలకు హాజరైనా తాజాగా జరిగిన మహానాడుకి హాజరైనా ఎన్టీఆర్ కు కొన్ని బాధ్యతలు అప్పిగించేవారని, ప్రచార కార్యక్రమాల బాధ్యత ఇచ్చేవారని తెలిపారు. అయితే ఆ ట్రాప్ లో ఎన్టీఆర్ పడకూడదని నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు.

అయితే మొదటి నుండి ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టినా మధ్యలో అవసరాల కోసం చంద్రబాబు చేరదీసాడు ఆపైన మళ్ళీ దూరం చేసారు. ఇందుకు కారణం లోకేష్ ని ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడేమో అని భయం చంద్రబాబుకి ఉంది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఎన్టీఆర్ కొద్ది కాలంగా టీడీపీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన కారణాలు ఆయనకి ఉన్నాయి, ఇక్కడ చంద్రబాబు అలాగే ఎన్టీఆర్ ఇద్దరి ఆలోచనా తప్పు కాదు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.



























