Analyst Damu Balaji : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.. ఈ పేరు గతంలో ఈడీ సోదాల నేపధ్యంలో బాగా పాపులర్ అయింది. కాగా తాజాగా ఇతన్ని థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడనే కారణంతో చికోటి ప్రవీణ్ అలియాస్ క్యాసినో ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. చికోటితో పాటు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి అను ఇతరులను కూడా సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న 93 మంది గ్యాంగ్ ను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల నుంచి భారీగా నగదుతో పాటు గేమింగ్ చిప్స్‌ను థాయ్‌లాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ లో జూదం నిషిద్దం కాగా ఇల్లీగల్ గా చికోటి క్యాసినో నడపడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులు అరెస్టు చేసారు. ఇక చికోటి ప్రవీణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

చికోటి చీకటి వ్యాపారాల చిట్టా చాలానే…
అనలిస్ట్ దాము బాలాజీ ప్రవీణ్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్, సైదాబాద్‌లోని వినయ్ నగర్ కాలనీ లో 20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్ చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారి. తండ్రి బిజినెస్ ను కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే సినిమాలంటే ఆసక్తి ఉండడం వల్ల నిర్మాతగా మారి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు, విలన్‌గా నటించినా అది వర్క్ అవుట్ కాలేదు. రియల్ ఎస్టేట్ లోకి వెళ్లినా మొదట్లో నష్టాలే చూసారు. అయితే అప్పులెక్కువయ్యి, అప్పుల నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్ చేయడం, ఆ కేసులో జైలుకు సైతం వెళ్లొచ్చాడు ప్రవీణ్. ఇక, ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తూ వచ్చిన ప్రవీణ్ క్యాసినో ప్రవీణ్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. క్యాసినో పుణ్యమా అని సెలబ్రిటీలను, రాజకీయ నేతలను సైతం బుట్టలో వేసుకుని జంట నగరాల్లో తొలినాళ్లలో బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినో నిర్వహించాడు అంటూ బాలాజీ వివరించారు. సిటీకే పరిమితమైన తన చీకటి వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు విస్తరించాడు. ఈ చీకటి బాగోతంలో పలువురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇక చికోటి అనగానే అతని జూ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుండి జంతువులంటే చాలా ఇష్టం ఉన్న ప్రవీణ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని కడ్తాల్ సమీపంలో సాయిరెడ్డిగూడెం దగ్గర ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. జూలో ఉండాల్సిన పాములు, ఇతర కొన్ని జంతువులను నిబంధనలకు విరుద్ధంగా ఫామ్‌హౌస్‌లో ఉంచాడు అంటూ దాము బాలాజీ ప్రవీణ్ గురించి తెలిపారు. అయితే ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించినా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏమి జరగడం లేదని చెప్పడం విశేషం అంటూ ఇక చికోటి ప్రవీణ్ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నట్టు, రాజకీయంగా కూడా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నట్లు బాలాజీ అభిప్రాయపడ్డారు.






























