Ankusham : 1989లో విడుదలైన రాజశేఖర్ పోలీస్ గా చెలరేగి నటించిన సినిమా అంకుశం. అప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే పోలీసులపై ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా అంకుశం. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఒక సీఎంను, తనకు చదువు చెప్పిన గురువును శత్రువుల నుండి కాపాడటానికి చేసే యుద్ధం అంకుశం. నిజాయితీ, ఆవేశం గల పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటన సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది. అప్పట్లో టాప్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ తరువాత రాజశేఖర్ నిలిచాడు. 70 లక్షల దాకా ఖర్చు పెట్టి 5 కోట్ల దాక వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.

కోడి రామకృష్ణ కు పోలీసులంటే గౌరవంతో తీసిన సినిమా….
అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న కోడి రామకృష్ణగారు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కథను సినిమా తీయాలని భావించారు. చిన్నతనంనుండి ఆయనకు పోలీసులంటే గౌరవం. అందుకే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథను చూపించాలని అనుకున్నారు. కథ రెడీ చేసుకుని అప్పటికే తనతో రెండు హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి కథ వినిపించారు. ఇక కథ డిఫరెంట్ గా ఉంటేనే సినిమా తీసే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కథకు ఓకే చెప్పారు. ఇక ఈ కథ రాస్తున్నప్పటి నుండి రాజశేఖర్ ని హీరోగా అనుకుని రాసిన కోడి రామ కృష్ణ కథను శేఖర్ కి వినిపించారు.

భావొద్వేగానికి లోనైన రాజశేఖర్ ఈ సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తానని చెప్పారట. ఇక సినిమా విషయంలో ఏవైనా సెన్సర్ సమస్యలు వస్తాయేమో అని శ్యామ్ ప్రసాద్ గారు భయపడినా కోడి రామకృష్ణ గారు భరోసా ఇచ్చారట. ఇక సినిమాలో హీరోయిన్ గా జీవిత ను తీసుకున్నారు. ఇక కీలక పాత్రలో సీఎం పాత్రకోసం ఎమ్ ఎస్ రెడ్డి గారిని సంప్రదించినపుడు ఆయన మొదట అంగీకరించలేదు. అయితే కోడి రామ్ కృష్ణ గారు ఆయనను కన్విన్స్ చేశారట. ఇక మిగిలింది విలన్ పాత్ర ఈ పాత్ర కోసం చాలా మందిని చూసినా కోడి రామకృష్ణ గారికి ఎవరూ నచ్చలేదు.

విలన్ గా శ్యామ్ ప్రసాద్ గారి ఇంట్లోని కుర్రాడు…తెలుగు ఇండస్ట్రీ కి విలన్ గా రామిరెడ్డి….
ఇక విలన్ ను ఎంపిక చేయక ముందే షూటింగ్ మొదలుపెట్టారు. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు షూటింగ్ కొంత వరకు పూర్తి చేసాక, ఒక సారి శ్యామ్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్లిన కోడి రామకృష్ణ గారు అక్కడ ఒక కుర్రాడిని చూసి విలన్ కి సరిగ్గా సరిపోతాడని డిసైడ్ అయ్యాడు. ఇక ఆ అబ్బాయిని ఒప్పించి షూటింగ్ మొదలుపెట్టారు. మొదటి సీన్ చార్మినార్ వద్ద రామి రెడ్డిని రాజశేఖర్ కొట్టుకుంటూ తీసుకెళ్లే సన్నివేశం. ఇక రామి రెడ్డి ఈ సన్నివేశం చేయడానికి నిరాకరించారట. గుడ్డలుడదీసి కొట్టుకుంటూ వెళ్లే ఆ సన్నివేశం చేస్తే కాలేజీలో అమ్మాయిలందరు ఏడిపిస్తారని తటపటాయించారట. కోడి రామకృష్ణ గారు ఒప్పించి చేయించారు.

ఇక రాజశేఖర్ నిజంగానే కొట్టడంతో రామిరెడ్డి గారు భయపడ్డారట. ఇక శ్యామ్ ప్రసాద్ గారు నచ్చజెప్పి చేయించారట. అయితే మొదటి సినిమా అయినా రామిరెడ్డి గారి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా తరువాత రామిరెడ్డి తెలుగులో టాప్ విలన్ అయ్యారు. సినిమా విడుదలయి మంచి వసూళ్లను రాబట్టింది. చిరంజీవి అత్తకి యముడు, బాలకృష్ణ ముద్దులమావయ్య సినిమాల తరువాత అంకుశం సినిమా టాప్ 3 సినిమాగా వసూళ్లలో నిలిచింది. ఇక ఈ సినిమా తమిళం లో డబ్ అయి అక్కడా ఘన విజయం సాధించింది. రాజశేఖర్ కు తమిళం లోనూ మంచి ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఇక హిందీ లో ఈ సినిమాను అభిమన్యు గా 1990 లో చిరంజీవి రీమేక్ చేసాడు. ఇక కన్నడ లో రవిచంద్ర ఈ సినిమాను రీమేక్ చేసారు. అన్ని భాషల్లోను సూపర్ హిట్ అయిన ఈ సినిమా పోలీసులకు గౌరవం తెచ్చిపెట్టింది. రాజశేఖర్ గారికి పోలీసుల సంఘం సన్మానం కూడా చేసారు.































