కోలీవుడ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ పేరు బాగా వైరలవుతుంది. ఆమె మరెవరో కాదు.. వనితా విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్ – మంజుల దంపతుల కూతురిగా చలన చిత్ర రంగానికి పరిచయమైన వనిత.. సినిమాల్లో కన్నా తన వ్యక్తిగత జీవితంలోని వివాదాల వల్లే ఎక్కువగా పాపులర్ అయిన సంగతి నెటిజన్లందరికీ తెలిసిందే. ఈమధ్యనే మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుండీ మరిన్ని వివాదాలలో చిక్కుకుంటూ ప్రతిరోజూ వార్తల్లోకొస్తుంది వనితా.

లాక్ డౌన్ సమయంలో పీటర్ పాల్ అనే వ్యక్తిని వనితా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన మాజీ భర్తలు మరియు ఇద్దరు కూతుర్ల సమక్షంలో.. క్రిస్టియన్ పద్ధతిలో ఈమె మూడో పెళ్లి చేసుకోవడం విశేషం. అయితే ఈమె పెళ్లి చేసుకున్న మరుసటి రోజే పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ వీళ్ళిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఊహించని పరిణామం. పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండా వనితాను పెళ్లి చేసుకోవడమేమిటి? అని ఆమె తన ఫిర్యాదులో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, డైరెక్టర్ లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి, నిర్మాత రవీంద్రన్ వంటి కోలీవుడ్ ప్రముఖులు వనిత మూడో పెళ్లినుద్దేశిస్తూ విమర్శల రూపంలో ట్వీట్లు చేశారు. సూర్యదేవి అనే మహిళ మరో మెట్టెక్కి వనిత మూడో పెళ్లిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియోలను కూడా విడుదల చేసింది. ఈ విమర్శలకు స్పందించిన వనిత తన లాయర్‌తో కలిసి పోరూర్ పోలీస్ స్టేషన్ లో నిర్మాత రవీంద్రన్ తో పాటు సూర్యదేవిపై కంప్లైంట్ ఇచ్చింది.

‘గత కొన్ని రోజులుగా మీడియాలో నా పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సూర్య దేవి అనే మహిళ తన ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తూ, నన్ను నానా రకాలుగా విమర్శిస్తూ వీడియోలను విడుదల చేసింది. అలాగే ప్రముఖ నిర్మాత రవీంద్రన్ కూడా నా గురించి తప్పుడు కూతలు కూసారు. ఇవి నాకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి’ అంటూ మీడియా ముందు ఆవేదన చెందింది వనిత.



























