ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 16 నెలలైంది. ఈ 16 నెలల పదవీ కాలంలో ప్రజా సంక్షేమ నిర్ణయాలకే జగన్ పెద్దపీట వేస్తూ వచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని అందరికీ ప్రయోజనం కలిగే విధంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని వ్యాపారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని వ్యాపారులంతా నష్టాలపాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లలో దుకాణాలను అద్దెకు తీసుకునే వ్యాపారులు ఎక్కువగా నష్టాలపాలయ్యారు. దీంతో వారికి ప్రయోజనం కలిగేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారం జరగని కాలంలో అద్దె భారాన్ని తొలగించి వ్యాపారులకు ఉపశమనం కలిగించారు. బస్సులు తిరగకపోవడంతో బస్ స్టేషన్లు నెలల పాటు ఖాళీగా దర్శనమిచ్చాయి.

వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో బస్సులు తిరగని సమయాల్లో అద్దెలు రద్దు చేయాలని షాపుల నిర్వాహకులు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరగా యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంటీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెల అద్దెలను ప్రభుత్వం మాఫీ చేసినట్టు వెల్లడించారు. మూడు నెలల అద్దెను మాఫీ చేయడంపై షాపుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీకి బస్సులతో పాటు దుకాణాల ద్వారా బాగానే ఆదాయం చేకూరుతుంది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే అయితే దుకాణాల యజమానులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ వ్యాపారులకు మేలు చేకూరేలా చేశారు. త్వరలో ఆర్టీసీ బస్ స్టాండ్లలోని ఖాళీ షాపులకు ప్రభుత్వం టెండర్లు పిలవబోతుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here