నెల్లూరు జిల్లా, కృష్ణ పట్నంకి చెందిన ఆనందయ్య ఆయుర్వేద ఔషదానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆయన ఇస్తున్న మందులలో కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి నిరాకరించింది. కంట్లో వేసే డ్రాప్స్ కు తప్ప మిగిలిన అన్ని మందులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. జాతీయ ఆయుర్వేద సంస్థ (CCRAS) ఇచ్చిన నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కంట్లో వేసే మందుపై ఇంకా నివేదిక రావాల్సి ఉందని, నివేదిక వచ్చిన వెంటనే ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఇక ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎటువంటి హాని లేదని CCRAS నివేదిక తేల్చడంతో… తాజగా ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఆనందయ్య ఇచ్చే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా.. రోగులకు బంధువులు గానీ కుటుంబ సభ్యులు గానీ వచ్చి మందును తీసుకువెళ్లాలని ఇందువల్ల కొవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పిన ప్రభుత్వం.. మందు పంపిణీలో కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది.
































