తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత నిర్ణయాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి తర్వాత సినిమాలు ఎందుకు చేయలేకపోయాననే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తన కెరీర్‌లో ఒక దశ తర్వాత తన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని విజయశాంతి తెలిపారు. సాధారణ హీరోయిన్‌గా కాకుండా యాక్షన్ పాత్రల్లో మెప్పించి, ప్రేక్షకుల ముందుకు ఒక హీరోలా నిలిచానని చెప్పారు. అదే సమయంలో తన పారితోషికం కూడా భారీగా పెరిగిందని, దాంతో మళ్లీ హీరో పక్కన సాధారణ హీరోయిన్‌గా నటించడం కష్టంగా మారిందని వివరించారు.
కథలు కుదరకపోవడం లేదా ఇతర వ్యక్తిగత కారణాలు కాకుండా, పూర్తిగా ఇమేజ్ మార్పే ఈ నిర్ణయానికి కారణమని ఆమె స్పష్టం చేశారు. తనపై ఆధారపడే కథలు రావడం ప్రారంభమయ్యాక, మళ్లీ హీరోకు జోడీగా కనిపించడం కథాపరంగా కూడా సెట్ కాలేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, తన సినీ ప్రయాణం పూర్తిగా అనూహ్యంగా సాగిందని విజయశాంతి అన్నారు. యాక్షన్ సినిమాలు చేస్తానని, టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటానని ముందుగా ఊహించలేదని, ఇవన్నీ దైవ అనుగ్రహంగా భావిస్తున్నానని చెప్పారు. జీవితంలో పేరు ప్రతిష్ఠలకంటే మంచిపనులు చేయడం ముఖ్యం అని ఆమె అభిప్రాయపడ్డారు.
రాజకీయాల్లోకి రావడానికి తన కుటుంబ అనుభవాలే ప్రేరణగా నిలిచాయని విజయశాంతి వెల్లడించారు. గతంలో తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు తనలో సమాజానికి ఏదో చేయాలనే తపన కలిగించాయని చెప్పారు. సేవా కార్యక్రమాలను ఆర్భాటంగా చూపించడం తనకు నచ్చదని, నిస్వార్థంగా చేయడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.






























