టాలీవుడ్ భక్తిరస చిత్రమైన “శ్రీరామదాసు”లో సీతాదేవి గా తెలుగు సినీ ప్రేక్షకుల ప్రశంసలందుకుని.. మంచి నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటి వేద అలియాస్ అర్చన. కూచిపూడి నృత్యకారిణిగా విశేష ప్రతిభ వున్న అర్చన 2004లో ‘తపన’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది.

అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో అర్చనకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నటించిన ‘నేను’ చిత్రంతో అర్చన ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రంతో సహాయ నటిగా సినీ ప్రేక్షకుల అభినంధనలు అందుకున్న అర్చన తన కెరీర్‌లో పౌర్ణమి, యమదొంగ, సామాన్యుడు, ఖలేజా మొదలైన చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా.. నృత్యకారిణిగా కూడా వివిధ వేదికలపై ప్రదర్శనలిస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 1’ రియాలిటీ షోలో కూడా పాల్గొన్న అర్చన.. టాప్ 5లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచిందన్న సంగతి తెలిసిందే.

తాజాగా బ్యూటిఫుల్ అర్చన మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్ 1’ రియాలిటీ షోలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను ప్రేక్షకులకు తెలియజేస్తూ.. “బిగ్ బాస్ షోలో మనం పీకేదేమీ ఉండదంటూ, ఆ విషయం తెలియకనే పార్టిసిపెంట్స్ ఏదేదో ఉహించుకుంటారంటూ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాకే తాను ఆ విషయాన్ని తెలుసుకున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇంటర్వ్యూలో సినీనటి వేద అలియాస్ అర్చన మాట్లాడుతూ.. ”బిగ్ బాస్ హౌస్‌లో రకరకాల స్వభావాలున్న వ్యక్తులను కంటిస్టెంట్స్ గా తీసుకున్నారని, వాళ్ళంతా ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళను అణగ తొక్కేయాలని, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలాగైనా వాళ్ళను బయటకు పంపించేయాలని చూస్తుంటారని, కానీ వాళ్ళకి అర్ధంకాని విషయమేమిటంటే..
ఎవరైతే తన తోటి కంటిస్టెంట్ ను తక్కువ చేస్తూ మాట్లాడతారో వాళ్ళే ముందు చులకన అవుతారని, మనం పీకేదేమీ వుండదక్కడ.. ఆడియన్స్ ఓటేస్తే గెలుస్తామంతే..! ఈ సింపుల్ లాజిక్ అర్థంకాకే చాలామంది ఫెయిలవుతుంటారు. బిగ్ బాస్ హౌస్ లో నుండి ముందుగా వాళ్ళే బయటికొచ్చేస్తుంటారు. ఇవన్నీ నేను బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యక్షంగా చూశాను. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎవ్వరినీ హర్ట్ చేయకుండా, మనల్ని హర్ట్ చేసిన వాళ్ళను మాత్రం అస్సలు వదలకూడదనే సూత్రాన్ని పక్కాగా నేర్చుకున్నాను” అని తెలియజేసింది. సినిమా ఆఫర్లు తగ్గిన టైంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈమధ్యనే ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ అధ్యక్షుడైన జగదీష్ భక్తవచ్చలమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇల్లాలు అవతారమెత్తింది.



























