రోజురోజుకు టెక్నాలజీ వినియోగం ఎంత పెరుగుతోందో టెక్నాలజీని వినియోగించుకుని మోసాలు చేసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అమాయకులను టార్గెట్ చేసి మోసగాళ్లు తెలివిగా వాళ్లను బురిడీ కొట్టిస్తున్నారు. డేటింగ్ యాప్స్ ద్వారా మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్ లైన్ డేటింగ్ పేరుతో కోట్ల రూపాయలు కాజేస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.

డేటింగ్ సైట్లలో రిజిష్టర్ చేసుకున్న వాళ్లకు అమ్మాయిలతో ఫేక్ కాల్స్ చేయిస్తూ మోసగాళ్లు ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బాధితులు మోసపోయామని తెలిసినా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడుతూ ఉండటంతో ఈ తరహా మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మోసపోయిన ఓ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తీగ లాగే డొంకంతా కదిలింది.

ఇద్దరు వ్యక్తులు డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలను నియమించుకుని కాల్ సెంటర్ ను నిర్వహిస్తూ అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కోల్ కతా కేంద్రం కాల్ సెంటర్ నిర్వహిస్తుండగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. 16 మంది అమ్మాయిలకు 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ప్రధాన నిందితులు బుద్ధ పాల్, ఆనంద్ కర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు వీరి నుంచి 51 సిమ్ కార్డులు, రెండు లాప్ ట్యాప్ లు, 24 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్స్ ను ఉపయోగించే యువకులు ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకోవాలని.. ఆన్ లైన్ లో అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నగదు జమ చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here