ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. బరువు నియంత్రణ నుంచి గుండె ఆరో్యం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో చాలా మంది ప్రతిరోజూ ఉదయం నడకను అలవాటు చేసుకుంటున్నారు. అయితే కొందరు ఖాళీ కడుపుతోనే వాకింగ్‌కు వెళ్లడం చేస్తుంటారు. ఇది అందరికీ సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఖాళీ కడుపుతో నడక చేయడం వల్ల కొంతమందిలో బలహీనత, తల తిరగడం, అలసట వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సమస్యలు మరింత త్వరగా తలెత్తవచ్చు. ఎక్కువసేపు నడిస్తే నీరసం, చెమటలు ఎక్కువగా రావడం వంటి ఇబ్బందులు కూడా కలగొచ్చు.
మధుమేహం ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీనివల్ల చేతులు వణకడం, తల తిరగడం, కళ్ల ముందు చీకట్లు కనిపించడం వంటి లక్షణాలు రావచ్చు.
అలాగే వృద్ధులు, బీపీ సమస్యలు ఉన్నవారు, తరచూ అలసటకు గురయ్యే వారు ఖాళీ కడుపుతో వ్యాయామం చేయకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాకింగ్‌కు వెళ్లే ముందు కొద్దిగా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. నానబెట్టిన శనగలు, డ్రైఫ్రూట్స్, అరటి పండు లేదా గ్లాస్ నీరు తీసుకోవడం వల్ల శరీరానికి తగిన శక్తి అందుతుంది.
వాకింగ్ చేసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం ఎక్కువ ఎండ పడకముందే నడక పూర్తి చేయడం మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి. అలసటగా అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి వాకింగ్ మంచి అలవాటే అయినప్పటికీ, ప్రతి ఒక్కరి శరీర పరిస్థితి వేరు. అందుకే ఖాళీ కడుపుతో వాకింగ్ చేయాలా వద్దా అనే విషయంలో వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



























