Avasarala Srinivas : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా కూడా సినిమాలు చేస్తూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. హైదరాబాద్ లో పుట్టి, పెరిగి చదువును పూర్తి చేసుకొని ఆ తరువాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న అవసరాల శ్రీనివాస్ సినిమాల మీద ఆసక్తితో అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ లో కోర్స్ చేసి సినిమాల్లో పనిచేయడం కోసం ఇండియా వచ్చారు. ఇక రైటర్ గా, డైరెక్టర్ గా అటు నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల నటుడుగా కంటే సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకున్నారట, అందుకే కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా వదులుకున్నారట.

మొహమాటంతో చేసినవి ఉన్నాయి.. కీర్తీ సురేష్ ఆ పాత్రలో బాగుండదనిపించింది…
సినిమాల్లో మొదట నటుడుగా అష్టా చెమ్మ, పిల్ల జమిందార్, ఊహలు గుస గుసలాడే వంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న అవసరాల కొన్ని సినిమాలను మాత్రం తెలిసిన వాళ్ళు మరీ బలవంతపెట్టడం వల్లే చేశాను ఇష్టం తో కాదు అంటూ చెప్పారు. ఇక ‘మహానటి’ సినిమా, నాగ అశ్విన్ తో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా నుండి ఉన్న పరిచయం వల్లే ఆ సినిమాలో ఎల్వి ప్రసాద్ పాత్రలో నటించాను.

ఆ సినిమా చేసేటపుడు ఎవరు సావిత్రి పాత్రలో చేస్తారు అనుకున్నాను. ఇక కీర్తీ సురేష్ అనగానే అంతకుముందు కమర్షియల్ సినిమాల్లో చూసి ఈ అమ్మాయి ఏం బాగుంటుంది, ఆ పాత్రకు సరిపోతుందా అనిపించింది. కానీ సినిమా కొద్ది రోజుల షూటింగ్ తరువాత కొన్ని షాట్స్ చూస్తే నా అంచనా తప్పని అర్థమైంది. అచ్చం సావిత్రిలా కాకపోయినా అలానే ఉంది చాలా బాగా నటించింది అంటూ అవసరాల చెప్పారు.



























