Baby died due to Menthoplus balm : చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నపుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఏ వస్తువులు తీసుకుని ఆడుతున్నారు అని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మరీ ముఖ్యంగా పసిపిల్లలు. తాజాగా కుర్నాల్ జిల్లాలో జరిగిన ఘటన ఒక కన్నతల్లికి ఆవేదన మిగిల్చింది. పుట్టక పుట్టక కలిగిన బిడ్డ అనుకోని పరిస్థితిలో మరణించడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది.

ప్రాణాలు తీసిన మెంతో ప్లస్ బామ్…
కర్నూల్ జిల్లా బెళగల్ కి చెందిన సువర్ణమ్మ, నల్లప్ప దంపతులకు పెళ్ళైనా పిల్లలు కలుగలేదు. ఎందరో దేవుళ్ళకు మొక్కినా డాక్టర్ల వద్దకు వెళ్లినా పిల్లలు కలుగలేదు. ఇరవై ఏళ్ళకి ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ పుట్టక పుట్టక ఒక మగబిడ్డ జన్మించాడు. ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ దంపతులను చూసి ఏ కన్నుకుట్టిందో మరి ఆ బిడ్డను దూరం చేసాడు భగవంతుడు. జనవరి ఒకటిన పదినెలల పిల్లాడిని కొత్త బట్టలు వేసి రెడీ చేసి పడుకోబెట్టి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది సువర్ణమ్మ. అదే సమయంలో పని మీద బయటికి వెళ్ళాడు నల్లప్ప. ఒక్కడే ఆడుకున్న పిల్లాడు అక్కడే ఉన్న మెంతో ప్లస్ బామ్ మూత కనిపించడంతో డాన్ని చేతిలోకి తీసుకుని ఆడుతూ నోట్లోకి పెట్టుకున్నాడు.

బాబు వెల్లకీల పడుకొని ఉండటం వల్ల మూత గొంతులోకి జారిపోయింది. దీంతో ఊపిరి ఆడక పిల్లడు మరణించాడు. కిచెన్ లోనుండి పిల్లాడి శబ్దం వినిపించక బయటికి వచ్చి చూసిన సువర్ణమ్మ ఉలుకు పలుకు లేని బిడ్డను చూసి ఏదో అయిందనే అనుమానంతో ఆసుపత్రి కి తీసుకెళ్లగా అక్కడికి నల్లప్ప చేరుకున్నాడు. డాక్టర్ చూసి అప్పటికే బాబు చనిపోయాడని చెప్పగా అసలు ఏం జరిగిందని పరీక్షలు నిర్వహిస్తే గొంతులో మెంతో ప్లస్ బామ్ మూత ఇరుక్కుని ఊపిరి ఆడక మరణించాడని తెలిసీ ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేదు. రాత్రి తల నొప్పి రావడంతో తలకు మెంతో ప్లస్ పట్టించుకున్న సువర్ణమ్మ మూత ఊడిపోయిన విషయం గమనించలేదు. అదే తన బిడ్డ ప్రాణాలను తీయడంతో గుండెలు అవిసేలా రోదిస్తోంది.



























