హైదరాబాద్‌లో కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై అధికారులు ఉక్కుపాదం మోస్తున్నారు. తాజాగా అత్తాపూర్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ అక్రమ బేకరీ యూనిట్‌పై హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పరిశుభ్రత ప్రమాణాలను పూర్తిగా విస్మరించి, అనారోగ్యకరమైన వాతావరణంలో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.

అధికారుల పరిశీలనలో ఆ బేకరీలో ఈగలు, దోమల మధ్యే ఆహార పదార్థాలు తయారవుతున్నట్లు గుర్తించారు. కనీస ఆహార భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడం గమనించిన అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా ఈ యూనిట్ పనిచేస్తున్నట్లు తేలింది.
ఈ అక్రమ కార్యకలాపాలకు బాధ్యుడైన యజమాని మొహమ్మద్ అహ్మద్‌ను అధికారులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని తదుపరి చర్యల కోసం జీహెచ్ఎంసీ సర్కిల్–20 అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
ఇలాంటి అక్రమ ఫుడ్ యూనిట్లపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో తప్పనిసరిగా శుభ్రత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.



























