Balagam fame Vijayalakshmi : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా మేనత్త పాత్రలో నటించిన పోచవ్వకు కూడా మంచి పేరు వచ్చింది. నిజానికి మన కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడపిల్లకు చాలా ప్రముఖ్యత ఇస్తారు. ఇంట్లో ఏ వేడుక జరిగినా వాళ్ళు ఉండాల్సిందే, అలాంటిది బలగంలో మేనత్త పాత్రకు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోసారు విజయలక్ష్మి.

డైరెక్టరా అనుకున్నా…
సురభి నాటక మండలికి చెందిన విజయలక్ష్మి గారు పుట్టినప్పటి నుండి జీవితం రంగస్థలం మీదే అని చెప్పొచ్చు. రంగస్థలంలో కృష్ణుడుగా, లోహితస్యుడిగా నటించారు. విజయలక్ష్మి గారు నాటకాలు మాత్రమే కాకుండా హరికథలను కూడా చెప్పగలరు. తెలంగాణ పల్లెల్లో ఎన్నో హారికథ ప్రదర్శనలు ఇచ్చిన ఆమెకు గ్రాంధికం బాగా అలవాటు ఉండటం వల్ల తెలంగాణ నుడికారం మాట్లాడటం కష్టమేమో అనుకుందట మొదట్లో. అయితే హారికథలు చెప్పినపుడు తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా తిరిగిన ఆమె అక్కడి స్త్రీలను ఎక్కువ గమనించేవారట. అలా ఆహార్యం, అలాగే డైలాగలను బాగా గుర్తు పెట్టుకోవడం వల్ల భాష మాట్లాడగలిగాను అంటూ తెలిపారు. బలగం సినిమా ఆడిషన్స్ కోసం హైదరాబాద్ లోని సురభి నాటక సంస్థ వారి కాలనీకి వెళ్లి అక్కడ ఆడిషన్స్ చేసినపుడు విజయలక్ష్మి గారు సెలెక్ట్ అయ్యారు.

జబర్దస్త్ లో కమెడియన్ గా తెలిసిన వేణు సినిమా డైరెక్టర్ అని చెప్పినపుడు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అతను ఆరు నెలలు తనకు నచ్చిన వారిని సినిమాలో పాత్రల కోసం ఎంపిక చేయడం చూసాక అతని కష్టం అర్థమైంది. ఐదేళ్ళు సినిమా కథ కోసం కష్టపడ్డారట వేణు అందుకే సినిమా అంత బాగా సహజంగా వచ్చింది అంటూ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఇక సినిమాలో మా నటన అంత సహజంగా రావడానికి కారణం మాత్రం వేణు గారే కారణం అంటూ తెలిపారు.



























