ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ స్లీపర్ బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుండటంతో, భద్రతా చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్లీపర్ బస్సులను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సంకేతాలు ఇచ్చింది.

ఈ విషయంపై స్పందించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్లీపర్ బస్సుల్లో భద్రతా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటపడే అవకాశాలు తక్కువగా ఉండటం, ఫిట్‌నెస్ సమస్యలు వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సుల నిషేధంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణ దూరాన్ని ఆధారంగా తీసుకుని గమ్యానికి చేరుకునే సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయానికి మించిన వేగంతో ప్రయాణించి ముందుగా చేరిన బస్సులను నగరాల్లోకి అనుమతించకూడదనే ‘టైమ్ లాక్’ విధానాన్ని తీసుకురానున్నారు.
దూరప్రయాణ బస్సుల్లో డ్రైవింగ్ భద్రత కోసం కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. రాత్రి సమయంలో డ్రైవర్ విశ్రాంతి తీసుకునేందుకు బస్సులో ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ ఆపరేటర్లకు సూచించారు.
ఇక జాతీయ రహదారులపై బస్సుల వేగాన్ని పర్యవేక్షించేందుకు స్పీడ్ గన్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రతి బస్సులో రెండు కెమెరాలు అమర్చాలని నిర్ణయించింది. ఒకటి డ్రైవర్ కార్యకలాపాలను గమనించేందుకు, మరొకటి రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాల పరిస్థితిని రికార్డ్ చేయడానికి ఉపయోగపడనుంది.
ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మొత్తంగా, ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఎంతవరకు ఫలితమిస్తాయో చూడాల్సి ఉంది.



























