Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మించారు. ఎన్నో కాంట్రావెర్సీలకు కేర్ ఆఫ్ గా నిలబడిన బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ హీరోల్తో సినిమాలను తీసి వరుస హిట్లను చూసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో లేకపోయినా పాలిటిక్స్ గురించి అలానే సినిమా ఇండస్ట్రీ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ బాగా సోషల్ మీడియాలో నానే బండ్ల అన్న తన సినిమాల గురించి, సినిమా నిర్మాణం గురించి, సినిమా హీరోల గురించి ఆసక్తికర వాఖ్యలను చేసారు.

బాలకృష్ణ తో అంతలోనే ఉండాలి…
బండ్ల గణేష్ మొదటి నుండి మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండేవారు. చిరంజీవి తనకు చాలా ఇష్టమైన హీరో అంటూ తెలిపిన ఆయన తనకు క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ అంటూ ఫీలింగ్స్ లేవంటూ తెలిపారు. అందుకే నా కమ్యూనిటీ వాళ్లకు దగ్గరగా లేనని చెప్పారు. ఇక బాలకృష్ణ గారితో పరిచయం ఎక్కువగా లేదని ఇక చిరంజీవి గారంటే చాలా ఇష్టమని అందుకే ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉన్నానని చెప్పారు.

అయినా చిరంజీవి, బాలకృష్ణ అనే కాంపౌండ్ అంటూ మనం అనుకోవడమే, వాళ్ళు వాళ్ళు ఎపుడూ కలిసి ఉంటారు మధ్యలో మనమే గొడవపడేది వాళ్ళ కోసం, అవసరమా అంటూ మాట్లాడారు. బాలకృష్ణ గారితో శత్రుత్వం లేదు అలాగని మిత్రుత్వం లేదు, ఆయనతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉన్నాను. ఇక నందమూరి కుటుంబానికి దూరం అనడం తప్పు ఎందుకంటే ఎన్టీఆర్ తో సినిమా చేశాను, తనతో సన్నిహిత్యం ఉంది అంటూ తెలిపారు. చిన్నప్పటి నుండి చిరంజీవి గారంటే ఇష్టం అందుకే ఆ ఫ్యామిలికి దగ్గరయ్యాను అంతే అంటూ క్లారిటీ ఇచ్చారు బండ్లన్న.



























