మెగాస్టార్ చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో దాదాపు ఇరవై మూడు చిత్రాలు రూపొందించబడ్డాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి కూడా.. ధనుంజయరెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన “ఖైదీ” చిత్రం చిరంజీవి సినీ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ నిర్మాతలు చిరంజీవితో మరొక చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. హీరోగా చిరంజీవిని, దర్శకుడిగా ఏ.కోదండరామిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఆ క్రమంలో వారు ఒక విజయవంతమైన సినిమాను రూపొందించాలనుకున్నారు. తిరిగి స్టోరీ బాధ్యతలను పరుచూరి బ్రదర్స్ కి అప్పగించడం జరిగింది.

ఈసారి బ్రిటిష్ కాలం నాటి కథతో పరుచూరి బ్రదర్స్ ముందుకు వచ్చారు. ఆ కథ.. 1930 వ దశకంలో ప్రతాప్(చిరంజీవి) ఒక ఓడలో పని చేస్తుంటాడు. అతను ఉన్నత వర్గానికి చెందిన సరోజతో (జయప్రద) ప్రేమలో పడతాడు. అతను పనిచేసే ఓడలో చౌడప్ప(నూతన్ ప్రసాద్) అనేవ్యక్తి కెప్టెన్ కావాలనే దురుద్దేశంతో ఓడ కెప్టెన్ ను విషాహారం ఇచ్చి చంపేస్తాడు. ఓడ కెప్టెన్ ప్రతాప్ ని పిలిచి అతన్ని కెప్టెన్ గా ఉండమని చెప్పి మరణిస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రతాప్ చౌడప్పను, అతనికి సహకరించిన వ్యక్తిని చట్టానికి అప్పగిస్తాడు. కానీ తాను పెళ్ళిచేసుకోబోయే సరోజను ప్రేమించాడనే కక్షతో జయరాం (మోహన్ శర్మ) అనే జమీందారు కెప్టెన్ హత్యను ప్రతాప్ మీదకు తోసి అతన్ని అండమాన్ జైలుకు పంపించి వేస్తాడు.

ప్రతాప్ కి ఆ జైల్లో తనలాగే శిక్షననుభవిస్తున్న మహేంద్రభూపతితో(జగ్గయ్య) పరిచయం ఏర్పడుతుంది. ఆయన కూడా జయరాం చేతిలో మోసపోయి ఉంటాడు. మహేంద్రభూపతి చనిపోతూ ప్రతాప్ కు ఒక దట్టమైన అడవిలో తాను దాచిన సిరిసంపదలుండే చోటు చెప్పి మరణిస్తాడు. భూపతి స్థానంలో ప్రతాప్ మరణించిన వాడిగా ఒక గోనెసంచిలో చేరి ఆ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఈ కథ పూర్తయిన తర్వాత ఖైదీ నిర్మాతల కోరిక మేరకు చిరంజీవి, పరుచూరి బ్రదర్స్, కోదండరామిరెడ్డి కలిసి స్టొరీ డిస్కషన్ లో పాల్గొన్నారు.

పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ బాగున్నప్పటికీ కథలో చివరికి హీరోయిన్ విలన్ ని పెళ్లి చేసుకుని ఓ కొడుకుని కన్నా కూడా హీరో, హీరోయిన్ వెంబడి తిరగడం లాంటివి కోదండరామిరెడ్డికి నచ్చలేదు. ప్రేక్షకులు ఇలాంటి ముగింపును ఇష్టపడరని కోదండరామిరెడ్డి చెప్పిన కూడా..నిర్మాతలు పట్టుపట్టడంతో కోదండరామిరెడ్డి చేసేదిలేక “వేట”చిత్రం ఎలాగో అలాగా పూర్తి చేసి 1986 మే 28 విడుదల చేయడం జరిగింది.చక్రవర్తి స్వరపరిచిన “ఊరేమిటమ్మ..పేరేమిటమ్మ.. నువ్వెవరు..” అలాగే జేసుదాసు ఆలపించిన “ఓ లేడీ కూనా.. ఈ వేటలోనా”..అనే పాటలు ప్రేక్షకాదరణ పొందినప్పటికీ. వేట చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటకట్టుకుంది.
































