సినిమా ప్రపంచంలో స్టార్‌డమ్ సాధించడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కొందరు నటీనటులు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో సతమతమవుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత అనుకోని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న తారలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ బెంగాలీ నటి ఇప్పుడు దీనస్థితిలో బతుకీడుస్తోంది. ఎన్నో సీరియల్స్‌లో నటించి బుల్లితెరను శాసించిన ఈ నటి, ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా రోడ్డు పక్కన నివసిస్తోంది.

ఆమె పేరు సుమి హర్ చౌదరి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో ఆమె రోడ్డు పక్కన తిరుగుతూ కనిపించింది. షార్ట్స్, నల్ల చొక్కా ధరించి, కాగితంపై ఏదో రాస్తూ, బెంగాలీ, ఇంగ్లీష్ రెండు భాషలలో తడబడుతూ మాట్లాడుతూ కనిపించింది. తొలుత ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు. తాను నటినని, తనకు ఆశ్రయం కావాలని అక్కడ వెళ్లేవారిని అడుగుతూ కనిపించింది.
ఆమె పేరు చెప్పడంతో, కొందరు స్థానికులు గూగుల్ సెర్చ్ చేయగా.. ఆమె ఫోటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో సుమి హర్ చౌదరి ఒకప్పుడు ప్రముఖ నటి అని నిర్ధారించుకున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి ఈ దీనస్థితిలో ఉండటం అందరినీ కలచివేస్తోంది.































