డెహ్రాడూన్, ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి చేస్తూ జూలై 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతిరోజూ ఒక శ్లోకాన్ని, అలాగే వారానికి ఒక శ్లోకాన్ని ఎంపిక చేసి, దాని అర్థాన్ని పాఠశాల నోటీసు బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

మానవ విలువలు, నాయకత్వ నైపుణ్యాల పెంపొందే లక్ష్యం
శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మానవ విలువలు, ప్రవర్తన, నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యత, శాస్త్రీయ ఆలోచనలను ఎలా అభివృద్ధి చేస్తాయో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) కింద భారతీయ సంప్రదాయం, జ్ఞాన వ్యవస్థ ఆధారంగా విద్యార్థులకు వివిధ విషయాలను బోధిస్తామని విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ కుమార్ సతి తెలిపారు.
అంతకుముందు, ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర పాఠ్యాంశాలకు సంబంధించి మే 6న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శ్రీమద్ భగవద్గీత, రామాయణాన్ని అందులో చేర్చాలని సూచనలు ఇచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి భగవద్గీత, రామాయణం పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
ముస్లిం మత పెద్ద స్వాగతం
ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ ప్రభుత్వ చొరవను స్వాగతించారు. పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని బోధించడం, వాటిని ప్రజలకు పరిచయం చేయడం చాలా మంచి విషయమని ఆయన అన్నారు. “రాముడు, కృష్ణుడు ఇద్దరూ మన పూర్వీకులు. ప్రతి భారతీయుడు వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం రాష్ట్ర విద్యా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.



























