BHEL Prasad : చక్రవాకం సీరియల్ లో విల్సన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ ఆ తరువాత పలు సీరియల్ లో నటించినా ఆ సీరియల్ లో వచ్చిన గుర్తింపు ఇంకే సీరియల్ కు రాలేదు. ఇప్పటికే ఆయన పేరు ప్రసాద్ అనే కంటే విల్సన్ అని చెబితే బాగా గుర్తుపడతారు. ఒకసారి తిరుమలకి వెళ్లిన సమయంలో అక్కడ పురోహితులు చక్రవాకం సీరియల్ లో విల్సన్ గా గుర్తుపట్టి మాట్లాడించడం బాగా అనిపించిందని చెప్పిన ప్రసాద్ గారు సినిమాల్లో అవకాశాలకోసం పడిన అవమానాలను, కష్టాలను గురించి చెప్పారు.

క్రిష్, హరీష్ శంకర్ అవకాశలు ఇవ్వలేదు…
అవకాశాల కోసం డైరెక్టర్ల దగ్గరికి పోడానికి ఎప్పుడూ ఆలోచించలేదు. వెళితేనే కదా అవకాశాలు వస్తాయని అనుకునేవాడిని. గంధం నాగరాజు నాకు స్నేహితుడు. ఒకసారి మాట్లాడటానికి వెళితే అక్కడ క్రిష్ జాగర్లమూడి నన్ను చూసి నక్సలైట్ పాత్రకు అడిగారు. షూటింగ్ అనుకున్న దానికంటే ముందే మొదలవడంతో నేను మా అమ్మాయి వీసా పని మీద చెన్నై వెళ్లాల్సి వచ్చి షూటింగ్ రెండు రోజుల తరువాత వస్తానని చెబితే ఆయన వేరే వారిని ట్రై చేసాడు. కానీ ఎవరూ సెట్ అవ్వకపోవడంతో చివరికి అతనే ఆ పాత్ర చేసాడు. గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర ఆయనే నటించాడు. ఇక మళ్ళీ వెళ్లి ఆయనను కలిసినపుడు కూడా నాతో చాలా గౌరవంగా మాట్లాడారు.

ఇప్పుడు కూడా కనిపిస్తే పలకరిస్తారు కానీ ఇంతవరకూ సినిమాలో అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఇక హరీష్ శంకర్ డైరెక్టర్ అవ్వకముందు డ్రామాలు వేసేటప్పుడు నుండి స్నేహితుడు. పెద్ద డైరెక్టర్ అయ్యాక అవకాశాలు అడగడానికి వెళితే బాగా మాట్లాడిస్తాడు కానీ ఇంతవరకూ అవకాశం ఇవ్వలేదు. తెలియని డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అడగుతున్న నేను తెలిసిన డైరెక్టర్ దగ్గర ఎందుకు సిగ్గుపడాలి అడుగుదాం అని వెళ్లి అడిగాను. చూద్దాం అని చెప్పాడు కానీ ఇంతవరకు తాను తీసిన ఒక్క సినిమాలో ఏదైనా చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంటర్వ్యూ లో నేను చెప్పినది చూసి నా బాధ అర్థం చేసుకుని అయినా ఇస్తాడేమో చూడాలి అంటూ చెప్పారు ప్రసాద్.



























