గ్లామరస్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరును సంపాదించుకున్న కరాటే కళ్యాణి బిగ్‌బాస్ 4లోకి కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ప్రోమోలో తన స్ట్రగుల్స్ ని పంచుకుని అందరి సానుభూతిని పొందింది. అలాగే ఈ షోకు రావడం వెనుకున్న ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పేసింది. శ్రీకాకుళంలో పుట్టిన కరాటే కల్యాణి విజయనగరంలో పెరిగింది. కరాటే కళ్యాణికి కృష్ణ సినిమాలో చేసిన బాబీ అనే క్యారెక్టర్ బాగా పేరుతెచ్చింది. అక్కడి నుంచి ఆమెను గుర్తించడం ప్రారంభించారు.

అయితే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేస్తాను.. గానీ నిజ జీవితంలో అలాంటి క్యారెక్టర్ కాదని అందరికీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా వివరించింది. తనకు చదువు అబ్బ లేదు గానీ సంప్రదాయ కళల మీద ఆసక్తి పెరిగిందని, చిన్నప్పటి నుంచి హరికథల మధ్యే పెరిగానని, తన తండ్రి గారు అవి చెబుతూనే పోషించారని, తాను కూడా అవే చెప్పేదాన్ని అని, హరి కథలే తనకు అన్నం పెట్టాయని చెప్పుకొచ్చింది. ఇక జీవితంలో ఓ కోరిక తీరలేదని, తన సీమంతం రోజున తన గర్భాన్ని చూసుకోవాలనే కోరిక తీరలేదని చెప్పుకుని బాధపడింది. పెళ్లిళ్లు కొందరికి అదృష్టంగా మారుతాయి.. మరికొందరికి దురదృష్టంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. పెళ్లి జరిగిన ప్రతీసారి గర్భం వచ్చేది పోయేది. అందరూ నన్ను మోసం చేశారు. అందరూ వాడుకోవాలని చూసినవారే అని తన మనోవేదనను తెలిపింది.

ఓ ఊరి నుంచి ఫోన్ వచ్చింది.. ‘ఇక్కడ ఓ పిల్లాడిని ఎవరో వదిలేశారు.. మీరు పెంచుకుంటారని అన్నారు కదా తీసుకుంటారా?’ అని అన్నారు. ఆ పిల్లాడినే ఇప్పటికి నా గుండెలపై పెట్టుకుని పెంచుకుంటున్నాను అని తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది కరాటే కళ్యాణి.

పిల్లల కోసం ఆరాటపడుతున్న ఆ సమయంలో ‘ఓ బాబును కోళ్ల గూడులో పడేసారు, మీరు పెంచుకుంటారా?’ అని ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ ఆమె బాధలకు ముగింపు పలికింది. మరో ఆలోచనే చేయకుండా వెంటనే బాబును దత్తత తీసుకుని అతడే సర్వస్వంగా ఆలనాపాలనా చూసుకుంటోంది. బిగ్‌బాస్‌లో ఉంటే తనను తాను అద్దంలో చూసుకోవడమేనని అంటోంది. మరి అద్దంలో తనకు తనే కొత్తగా కనిపిస్తారా? తన చుట్టూ ఉండే వారికి కొత్తగా దర్శనమిస్తారా? పనిలో పనిగా కోపమొస్తే తన కరాటే ప్రదర్శనను కూడా బయటపెడతారా చూడాలి.



























