బాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉండే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఒకవేళ లేడీ ఒరియెంటెడ్ సినిమాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకుంటాయా అన్నది డౌట్. అయితే ఈ విషయంలో ఈమధ్య కాలంలో చాలా మార్పులొచ్చాయనే చెప్పవచ్చు. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చాలా వస్తున్నాయి.

ఈ మధ్యనే విడుదలైన కంగనా రనౌత్ క్వీన్, దీపికా పాడుకొనే పద్మావతి సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే. దీపికా పాడుకొనే లీడ్ రోల్ చేసిన పద్మావతి సినిమా సూపర్ హిట్టైంది. అంతేకాదు.. ఏకంగా రూ.600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది దీపికా. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటూ.. రెండు చేతులా సంపాదిస్తున్న దీపికా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. 2018 లో అత్యధిక బ్రాండ్ వ్యాల్యూ సాధించిన ఇండియన్ సెలెబ్స్ లో దీపికా రెండో స్థానంలో నిలిచింది.

ఇన్ని ఘనతలు సాధించిన బాలీవుడ్ క్వీన్ దీపికా మన టాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించింది. అదీ ఓ ఐటెం సాంగ్ లో వెండితెరపై తన డాన్స్ ఫెర్ఫామెన్స్ ను చూపించింది. కాకపోతే మన తెలుగు ప్రేక్షకుల దురదృష్టమో ఏమో కానీ ఇప్పటి వరకూ ఆ సినిమా వెలుగులోకి రాలేదు. ఏంటి.. నమ్మడం లేదా..?! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తెలుగు సినిమా ఎప్పుడు చేసిందబ్బా అని బుర్ర గోక్కుంటున్నారా..? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న తొలిరోజుల్లో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్‌ల లాగే దీపిక కూడా ఓ తెలుగు సినిమాలో నటించింది. అయితే ఆ మూవీ ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు.

అంతేకాదండోయ్.. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కూడా టాలీవుడ్ లో బాగా పేరున్న జయంత్ సి పరాన్జీ అంటే నమ్మశక్యంగా లేదు కదూ..!. ఇదంతా పదేళ్ల క్రితం జరిగింది కాబట్టి మీరు నమ్మరులెండి.. అప్పట్లో ఈ అందాల తార ఇంకా బాలీవుడ్‌కు వెళ్లలేదు. ఒక్క బాలీవుడ్, టాలీవుడ్ లోనే కాకుండా.. కన్నడలో కూడా ఉపేంద్ర సరసన హీరోయిన్‌గా నటించింది. ఇక ఆ రోజుల్లో దీపికా నటించిన ఏకైక తెలుగు చిత్రం కోసం చెప్పాలంటే.. జయంత్ తెరకెక్కించిన “లవ్ 4 ఎవర్” సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది దీపిక. కానీ ఈ సినిమా ఎందుకనో ఇంతవరకూ విడుదల కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ కూడా విడుదలయ్యాయి కానీ పాటను విడుదల చేయలేదు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది దీపిక. ఇక ఆ తర్వాత ఆమె బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.



























