మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. చాలా సార్లు మనం చేసే చిన్నచిన్న పనులతో కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూస్తూనే ఉంటాం. అందుకే ఇంటి నుంచి బయట అడుగుపెట్టింది మొదలు.. తిరిగి ఇంటికి వచ్చేదాకా జగ్రత్తగా ఉండాలంటూ మన తల్లిదండ్రులు కూడా చెబుతుంటారు.

అయితే తాజాగా జరిగిన ఘటన దురదృష్టరమైనది. ఇలాంటి సంఘటననే హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు పై పడిన చెప్పును తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు వదిలాడు ఓ యువకుడు. ఈ విషదకర సంఘటనతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే… నగరంలోని భాగ్యలతలోని శాంతి నగర్ ప్రాంతానికి చెందిన రిచ్ పాల్ కొడుకు రాహుల్( 18) స్థానికంగా ఉన్న జ్యూవెలరీ షాపులో పనిచేస్తున్నాడు. అయితే ఉదయం రాహుల్ చెప్పు తన ఇంటి మొదటి అంతస్తులో ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఈ క్రమంలో చెప్పును తీసుకునే ప్రయత్నం చేశారు. అల్యూమినియం రాడ్డుతో చెప్పును తీసుకునేందుకు ప్రయత్నించాడు.
కాగా పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను గమనించలేదు. పొరపాటున హైటెన్షన్ వైర్లకు అల్యూమినియం రాడ్డుకు తగలడంతో విద్యుత్ షాక్ తగిలి రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమితం అతన్ని వనస్థలిపురం ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

































