హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2025: బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి సంచలన రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో, ఆమె పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

కవిత సంచలన ఆరోపణలు చేస్తూ, కేటీఆర్‌కు హరీష్ రావు నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. “హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ బీఆర్ఎస్ మంచి కోరుకునేవారు కాదు. రేపు కేటీఆర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వొచ్చు,” అంటూ ఆమె బాంబు పేల్చారు. తన బాధను కేటీఆర్ ఎప్పుడూ అర్థం చేసుకోలేదని, “ఎప్పుడైనా నా గురించి ఆరా తీసావా?” అని కవిత నిలదీశారు.
ఈ రాజీనామా మరియు కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో లోతైన సంక్షోభాన్ని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.




























