BRS – Congress : కర్ణాటక ఎన్నికలు యావత్ దేశానికి షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా తెలంగాణకు.. అసలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పు చెప్పడంతో ఆ పార్టీకి ఓ రేంజ్‌లో బూస్ట్ ఇవ్వగా.. మిగిలిన పార్టీలకు మాత్రం పెద్ద షాకే ఇచ్చాయి. నిజానికి కర్ణాటకలో హంగ్ రావొచ్చని భావించారంతా. కానీ అది జరగలేదు. ఈ ఫలితాలు ముఖ్యంగా తెలంగాణకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఫలితాల మాటేమో కానీ ప్రస్తుతం ఎవరి లెక్కలు వారివి.. కర్ణాటక ఫలితంతో కొత్త సమీకరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటా సమీకరణాలు..? అవి బీఆర్ఎస్‌కు లాభిస్తాయా? లేదంటే కాంగ్రెస్ పార్టీకా? అనే విషయాలపై ప్రత్యేక కథనం..

సరిహద్దు ఓటర్లు సైతం కాంగ్రెస్ వైపే..
కర్ణాటక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉండే చోట.. అలాగే తెలంగాణ – కర్ణాటక సరిహద్దులోనూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది. నిజానికి కర్ణాటకపై కేసీఆర్ మరింత దృష్టి సారించారు. జేడీఎస్ అధినేత కుమారస్వామిని అడ్డు పెట్టుకుని కర్ణాటకలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన ఓటర్లు మరి తెలంగాణలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అక్కడి ఫలితాలు కొత్త సమీకరణాలకు దోహదపడుతున్నాయి. త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికలను ఈ ఎన్నికల ఫలితం ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా?
నిజానికి బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత కర్ణాటకతోనే సీఎం కేసీఆర్ ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను కొనసాగించారు. కాబట్టి కర్ణాటక ఎన్నికల ఫలితం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త లెక్కలు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతగా చీలి తమకు లాభం చేకూరుస్తుందని.. బీఆర్ఎస్‌కు నష్టం చేస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందంటే అది తమకు ఎంత మేర నష్టం చేకూరుస్తుందనే లెక్కలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ ప్రభావమే పొరుగు జిల్లాలపై పడిందనే వాదన వినిపిస్తోంది. ఇదే నిజమైతే తెలంగాణలోనూ బీఆర్ఎస్‌కు నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్‌కు గడ్డుకాలమేనా?
మొత్తానికి వార్ సీన్‌లో నుంచి బీజేపీ సైడ్ అయిపోయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కానుందని రాజకీయ వర్గాల్లో బీభత్సంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలను కాంగ్రెస్ వైపునకు మళ్లించే యత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం యాక్టివ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాలు సైతం కాంగ్రెస్ ఉత్సాహానికి కారణమయ్యాయి. మొత్తానికి బీఆర్ఎస్‌కు రానున్నది గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు మహారాష్ట్రలో ఏదో సాధిద్దాం అనుకుంటే అక్కడ బొక్కబోర్లా పడింది. ఇక కర్ణాటకలో చక్రం తిప్పాలనుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాజకీయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం..!