ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు నవరత్నాలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాడు. అయితే పలు పథకాలకు అర్హులైనా వివిధ కారణాల వల్ల ఆ పథకాలకు ప్రజలు అర్హత పొందలేకపోతున్నారు.

ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో జగన్ సర్కార్ ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ప్రజలకు ఆ నంబర్ల గురించి అవగాహన కల్పించనుంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా జగన్ సర్కార్ ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. జగన్ సర్కార్ ప్రజా సమస్యల కొరకు 1902 నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ నంబర్ ద్వారా నవరత్నాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యల గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. రైతులు 1907 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు సలహాలు, సూచనలు కూడా తీసుకోవచ్చు. విద్యుత్ సేవలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నా 1912 నంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
ఇసుక, మద్యం సమస్యల కోసం 14500, అవినీతి నిరోధం కోసం 14400, ఆంబులెన్స్ కోసం 108, వైద్యం, ఆరోగ్యం కొరకు 104, మహిళలు లైంగిక వేధింపులు లేదా విపత్కర పరిస్థితులు ఎదురైతే 112 లేదా 181 నంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది. అగ్నిమాపక కేంద్రానికి సంబంధించిన సమాచారం పొందాలంటే 101 నంబర్ కు ఫోన్ చేయాలి.





























