తెలుగు చలన చిత్ర రంగంలో బాల నటులుగా పరిచయమై ఆ తర్వాత హీరోలుగా దుమ్ము రేపినవాళ్ళు చాలామంది ఉన్నారు. నాటి తరుణ్ మొదలుకుని నేటి సాత్విక్ వర్మ వరకూ చిన్నతనంలో వీళ్ళు చేసే నటన అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే ‘డీజే దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ‘కేడి’ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన సాత్విక్ వర్మ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆరేళ్ళ వయస్సులో 2వ తరగతి చదువుతుండగానే వెండితెరపై ఎంట్రీ ఇచ్చి, DJ, శ్రీవల్లీ, అజ్ఞాత వాసి, గోలీమార్,కేశవ, రేసుగుర్రం, ఆటాడుకుందాం రా.. వంటి చిత్రాలలో నటించి అందర్నీ మెప్పించి ఇప్పటికి దాదాపు 80 చిత్రాలను పూర్తి చేసేసాడు. ఈమధ్యనే ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాత్విక్ మాట్లాడుతూ ‘బాహుబలి’ చిత్రం గురించి ప్రస్తావించాడు.

ఈ చిత్రంలో నేను కొండ ఎక్కే సీన్ ఒకటి వుంది. ‘నువ్వు ఎక్క గలుగుతావా.. అంత ధైర్యం ఉందా?’ అని రాజమౌళి గారు అడిగారు. ‘ఏమీ భయపడకు మేమంతా ఉన్నాం కదా.. కొంత దూరం ఎక్కేసి ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి జారిపో’ అని చెప్పారు. కొంత దూరం కొండ ఎక్కేశాక నాకు చాలా భయమేసింది. ‘అక్కడి నుంచి జారిపో’ అని రాజమౌళిగారు చెప్పడంతో అలాగే చేశాను. అదృష్టం కొద్దీ నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. ప్రభాస్ గారు సెట్లో నన్ను డాళింగ్.. డాళింగ్ అని పిలిచేవారు. నేను కొండెక్కేటప్పుడు ఆయన ఆ కొండ కిందనే వున్నారు. నేను కొండ దిగిన తరువాత, ‘నీకు చాలా ధైర్యం ఎక్కువ డాళింగ్.. నాకన్నా బాగా చేస్తున్నావ్’ అంటూ మెచ్చుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు. చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన సాత్విక్ సడన్ గా ఈమధ్య సినిమాల్లో కనిపించడం మానేశాడు. కారణం ఏమిటా.? అని ఆరా తీయగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గుర్తు పట్టలేనంత హ్యాండ్సమ్ గా మారిపోయాడు. త్వరలోనే హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. లాక్ డౌన్ సమయంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన కసరత్తులన్నిటినీ పూర్తి చేసాడని ఫిల్మ్ నగర్ ప్రముఖుల టాక్. మరి మన సాత్విక్ యంగ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాల్సిందే.!




























