తెలుగు సినీ కళామతల్లి ఎవరిని అక్కున చేర్చుకుంటుందో ఎవరిని పక్కన పెడుతుందో ఎవరూ ఊహించలేరు.సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే దగ్గర దారి ఏది అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం కష్టపడి పనిచేయడం.ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే అంతకుమించి దగ్గరదారి మరొకటి లేదనే చెప్పవచ్చు.గుమ్మడి కాయంత కష్ట పడిన కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలి అన్నది వెనుకటి సామెత. కాని అదృష్టాన్ని కాకుండా చిరంజీవి కష్టాన్ని నమ్ముకున్నారు.

1978 ఆ ప్రాంతంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆ కుర్రాడు అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగి ఆకాశపు హద్దులు దాటిన చరిత్ర అతనిది… “పునాదిరాళ్లు” చిత్రంతో పునాది వేసుకున్న అతని సినీ గమనం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది. హిట్టు ఫ్లాప్ ల మేళవింపుతో సినీ కళామతల్లి ఒడిలో తనదైన ముద్ర వేశారు.

1978 ఫిబ్రవరి 11న మెగాస్టార్ చిరంజీవి “పునాదిరాళ్లు” చిత్రంలో మొదటిసారిగా అలనాటి మేటి నటి సావిత్రమ్మతో నటించే అవకాశం పొందారు. సినిమా షూటింగ్ మొదటి రోజు నరసింహరాజు, చిరంజీవి మిగతా ముగ్గురు కాళ్ళు కడుక్కుని సావిత్రి ఉన్న ఇంట్లోకి వెళ్ళాలి. చిరంజీవి తెలివిగా ఆలోచించి కెమెరామన్ “నివాస్” దగ్గరికి వెళ్ళారు. దీనికంటే ముందు సీన్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పొలం పనులు చేసి ఇంటికి వస్తారని చెప్పడంతో.. పక్కకు వెళ్లి చిరంజీవి గడ్డి పోచలను తలపై, చొక్కాపై వేసుకొని ఇంటి ముందున్న తొట్టిలో నీళ్లు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళారు. మిగతా నలుగురు షాట్ రెడీ అనగానే వచ్చి నిలుచున్నారు.

ఇది గమనించిన కెమెరామెన్ నివాస్ చిరంజీవితో.. వారిలా కాకుండా నువ్వు మాత్రం దీనికంటే ముందు సీన్ తెలుసుకుని మరీ నటించావు. నువ్వు సినిమా ఫీల్డులో సక్సెస్ అవుతావని కెమెరామెన్ నివాస్ కితాబు ఇచ్చారు. ఈ సినిమా విడుదల లేట్ అవడంతో “ప్రాణం ఖరీదు” చిత్రంలో చిరంజీవి నటించడంతో ఈ సినిమా ముందుగా విడుదలైంది. ఆ తర్వాత కళా దర్శకుడు బాపు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అలా అయన “మన ఊరి పాండవులు” చిత్రంలో నటించారు.

1978 బాపు దర్శకత్వంలో మన ఊరి పాండవులు చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణంరాజు, మురళీమోహన్ చిరంజీవి, ప్రసాద్ బాబు, భానుచందర్ ప్రధాన తారాగణంగా నటించారు. గ్రామ పెద్ద అయిన రావు గోపాల్ రావు అకృత్యాలను అడ్డగించే యువకులుగా ఈ ఐదుగురు కనిపించారు. తొలిసారిగా అల్లు రామలింగయ్య, చిరంజీవి కలిసి ఈ చిత్రంలో నటించారు. మంచి కథా కథనాలతో వచ్చిన ఈ సినిమా విజయాన్ని సాధించడంతో అల్లు రామలింగయ్య కూతురు సురేఖ మన ఊరి పాండవులు చిత్రాన్ని చూశారు.

ఈ సినిమాలో పల్లెటూరులో చిరంజీవి తరచూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవరో కుర్రాడు సైకిల్ భలే తొక్కుతున్నారని ఆమె మనసులో అనుకుందట… తర్వాతఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులతో ఆ విషయాన్ని పాలుపంచుకున్నారు. కట్ చేస్తే రెండు సంవత్సరాలు తిరగకముందే చిరంజీవి సురేఖ-పెళ్లి నిశ్చయమైంది. వేదమంత్రాల మధ్య వీరిద్దరూ ఒకటయ్యారు. అలా సురేఖ ఏది అనుకున్నా కూడా అది జరిగిపోతూ ఉంటుందని ఈమధ్య చరణ్ తను కలిసి నటించాలని సురేఖ అనుకున్నారట కట్ చేస్తే “నేను చరణ్ “ఆచార్య” సినిమాలో కలిసి నటించామని ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయాన్ని వెలిబుచ్చారు.



























