ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజాసంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇతర రంగాలతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల మెప్పు పొందుతోంది. తాజాగా సీఎం జగన్ ప్రజల ఆరోగ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుని ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

ఇతర రంగాలతో పోలిస్తే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలో పని చేస్తున్న 20,000 మంది ఏ.ఎం.ఎంలు దాదాపు కోటీ 50 లక్షల కుటుంబాలలో నివశిస్తున్న ఐదున్నర కోట్ల జనాభాకు వైద్య పరీక్షలు నిర్వహించి.. వారిలోని ఆరోగ్య సమస్యలను గుర్తించి.. సకాలంలో చికిత్స అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని జగన్ చాటి చెప్పారు. ఏ.ఎం.ఎంలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను క్యూఆర్ కోడ్ రూపంలో భద్రపరిచేలా ప్రభుత్వం యాప్ ను రూపొందించింది. రాబోయే 30 రోజుల్లో ఏ.ఎం.ఎంలు కేటాయించిన ఇళ్లలో ఆశా కార్యకర్తల సహాయంతో ncd&amb యాప్ లో నమోదు చేస్తారు.
ఆరేళ్లలోపు చిన్నారులను ఒక కేటగిరీగా, ఆరు నుంచి 20 ఏళ్ల లోపు వయస్సు వారిని మరో కేటగిరీగా, 20 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు వారిని, 60 ఏళ్ల పై బడిన వారిని ఇతర కేటగిరీలుగా విభజిస్తారు. ఏ.ఎన్.ఎంలు సేకరించిన డేటాను భద్రపరిచి బాధ ప్రజలు బాధ పడుతున్న రోగాలకు అనుగుణంగా చికిత్స అందిస్తారు. అవసరమైతే ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల ద్వారా చికిత్స అందేలా చేస్తారు.
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏ.ఎన్.ఎంలు ప్రధానంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు, చిన్నారుల్లో రక్తహీనత, వినికిడి సంబంధిత సమస్యలు, మహిళల్లో రక్తహీనత, డయాబెటిస్, క్షయ, కుష్టు వ్యాధి లక్షణాలు, హైపర్ టెన్షన్, క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు.



























