గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ కరోనాతో పోరాడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడటంతో ఆయన ఆగస్టు 5న చెన్నైలోని MGM హాస్పిటల్ లో చేరారు. ముందు జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు కనిపించినప్పటికీ, ఆగస్టు 13వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తాజాగా ఆయనకు వెంటిలేటర్ ను తొలగించి ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లుగా తెలియడటంతో సినిమా రంగమంతా కలత చెందుతోంది. ఈ నేపథ్యంలో ఎస్.పీ బాల సుబ్రహ్మణ్యం గారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సినీరంగ ప్రముఖులు, బాలు ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.

తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీలైనంత త్వరగా కోలుకొని సంగీతాభిమానులందరినీ అలరించాలని కోరుకుంటూ ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ.. ఆయనతో తనకున్న మైత్రిని ఈ సందర్భంగా జ్ణాపకం చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

”బాల సుబ్రహ్మణ్యం, నేనూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బాలు అని పిలిస్తే.. ఆయన నన్ను శిశుపాల, భక్త అని సరదాగా పిలిచే వారు. షూటింగ్ లలో.. ఆడియో ఫంక్షన్లలో కలుసుకున్నప్పుడు మాత్రం మోహన్ బాబు అని పిలిచేవారు. నా బాల్యం నుంచే.. అంటే కాళహస్తిలో వున్నప్పుడు నేను బడికి వెళ్ళే రోజుల్లోనే మా ఇద్దరి మధ్యా మంచి స్నేహబంధం ఉంది. సాధారణంగా గాయకులెక్కువగా సినీ ల్యాబ్ లోకి రాగానే ముందుగా డబ్బు తీసుకుంటూ వుంటారు. ఎన్నో చిత్రాలకు బాలుతో కలిసి పని చేశాను. కానీ ఆయన ఏనాడూ నా దగ్గర డబ్బు తీసుకోలేదు. ఆ విషయానికి వస్తే.. ఒకసారి నేనే భోజనానికి డబ్బుల్లేక బాల సుబ్రహ్మణ్యం దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ అప్పు ఇప్పటికింకా తీర్చనేలేదు. అందుకే అప్పుడప్పుడూ బాలు ‘ఏమయ్యా.! అప్పడెప్పుడో నా దగ్గర అప్పుగా తీసుకున్న ఆ వంద రూపాయలు ఇంకా ఇవ్వనేలేదు. ఇప్పటికి ఆ వంద వడ్డీతో సహా కోటి రూపాయిలై ఉంటుందంటావా.?’ అని సరదాగా ఆట పట్టించే వారు.

ఏ స్వరాభిషేకంతో ఆ సంగీత సరస్వతికి ముద్దుబిడ్డగా జన్మించాడో ఆ గాన గంధర్వుడైన మా బాలు అదే గొంతుతో మళ్ళీ సర్వ దేవతల సంకీర్తనలను పాడాలి. వాళ్ళందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా కోలుకోవాలి. మళ్ళీ మనందరి మధ్యకొచ్చి మంచి మంచి పాటలను ఆలపించాలని అందరం కోరుకుందాం” అని భావోద్వేగంతో మోహన్ బాబు ఇంటర్వ్యూను ముగించారు. ఇదిలా వుండగా.. ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్న SP బాల సుబ్రహ్మణ్యంకు తను పాడిన పాటలని వినిపిస్తున్నారని తెలిసింది. బాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఉన్న వార్డులో పాటల్ని ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.

బాలు త్వరగా కోలుకొని బయటకు రావాలంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు.. సినీ ప్రముఖులు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, కె.రాఘవేంద్ర రావు, ఇళయరాజాలతో పాటు పలువురు రాజకీయ, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు. లేటెస్టుగా Sp.బాల సుబ్రహ్మణ్యం కుమారుడు Sp చరణ్.. నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని మీడియాకి తెలియజేస్తూ.. మనోవేదనకు గురవుతూ.. ‘‘మీ ప్రార్థనలు వృథాగా పోవు. దేవుడు ఉన్నాడు. నాన్న ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అంటూ వణుకుతున్న గొంతుతో చరణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.



























