మా నాన్న వడ్రంగి.. దీపావళి టపాసులు కూడా కొనలేని పరిస్థితి.. అంటూ డబ్బు విలువను తెలియజెప్పిన బ్రహ్మానందం !

0
497

బ్రహ్మానందం ప్రత్యక్షంగా కనపడనవసరం లేదు, అతని పేరు వినపడగానే నవ్వొస్తుంది. ఆయనకు నవ్వే జీవం, నవ్వే జీవితం, నవ్వే సర్వస్వం. ఆయన ఏడ్చినా మనకు నవ్వొస్తుంది. చిన్నతనంలో బడి ఎగ్గొట్టి గుడికి వెళ్లడం, కొసరు కోసం కొట్టుకెళ్లడం, చొప్పదంట్లతో దీపావళి జరుపుకోవడం.. ఇప్పుడు కారు నల్లద్దాలు కిందికి దింపుకుని ఊర్లో రహస్యంగా తిరగడం.. ఇలా తన ఊరి గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు పద్మశ్రీ బ్రహ్మానందం. కష్టమంటేనే తనకు ఎక్కువ ఇష్టమని నవ్వుతూ నవ్వుతూనే తనకు బుద్ధి లేకపోయినా తెలివి ఉందని గుర్తించిన తండ్రి గురించి బోలెడు విశేషాలను తెలియజేశారు బ్రహ్మకైనా ఆనందం కలిగించగల ఈ నవ్వుల బ్రహ్మానందం.

“వడ్రంగి పనిచేసే మా నాన్న.. పది మంది పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పి వాళ్లిచ్చే డబ్బులతో మా కుటుంబాన్ని పోషించారు. సరుకుల కోసం అమ్మ ఎప్పుడు కొట్టుకి వెళ్లినా తోడుగా నేనే వెళ్లేవాడిని. చూడటానికి అమ్మకు సాయం చేస్తున్నట్టు ఉండేది. కాని నేను వెళ్లేది మాత్రం బెల్లం ముక్క కోసం. మా ఇంటి దగ్గరున్న కొట్లో శేషమ్మ, లక్ష్మీపతి ఉండేవారు. వాళ్లప్పటికే పెద్ద వయసువారు. అలాగే ఊళ్లోకి చిలకడ దుంపల బండి వచ్చేది. ఇప్పుడంటే అన్ని కాలాల్లోనూ అన్నీ దొరుకుతున్నాయి కాని అప్పట్లో సీజన్‌ వారీగా వచ్చేవి. బండి ఊర్లోకి వచ్చిందనగానే డబ్బుల కోసం నాన్న దగ్గరికి వెళితే ఒక్క కసురు కసిరేవారు.

నాన్న విషయంలో పేదరికం ఒక జబ్బులా ఉండేది. చిరాకు పడటం, తిట్టడం, కోపం వచ్చినప్పుడు చితక్కొట్టడం, నిరాశగా ఉండడం ఆ జబ్బు లక్షణాలన్నమాట. ఆయన్ని జబ్బులా పట్టి పీడించిన ఆ పేదరికమే నా జీవితంలో నాకు వైద్యంలా ఉపయోగ పడింది. ఒక పేదవాడిగా నాన్న ఊళ్లో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు భరించాడో, ఆడపిల్లల్ని గట్టెక్కించడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో.. ఆ సంఘటనలన్నీ నన్ను కసితో ముందుకు నడిపించేలా చేశాయి. ఊరే జీవితానికి పునాది వేస్తుంది, పైకెదిగే మార్గాన్ని చూపుతుందనడానికి నా జీవితమే ఉదాహరణ. అలాగే ఊళ్లోకి పండగలు వచ్చేవి కాని మా ఇళ్లలోకి వచ్చేవి కావు. ఎందుకంటే పండగ జరుపుకోవాలంటే చేతిలో డబ్బులుండాలి. లేదంటే నో పండగ, నో ఎంజాయ్‌మెంట్. అయితే ఒక సౌకర్యం మాత్రం ఉండేది.. పండగ జరుపుకునే వాళ్ళని చూసి ఎంజాయ్‌ చేయడం (నవ్వుతూ…) దీపావళి పండగొచ్చిందంటే పెద్దవాళ్ల ఇళ్ల ముందర పేలే టపాసుల శబ్దాలు, చిచ్చు బుడ్ల మెరుపులు చూసి ఆనందించేవాళ్లం. ఆ రోజు రాత్రి మా చేతుల్లో చొప్పదండ్లు తప్ప మరేమీ ఉండేవి కాదు.

ఎండిపోయిన జొన్న కట్టనే తాడుతో గట్టిగా కట్టి అంటించే వాళ్లం. అది మెల్లగా కాలుతూ పొగ వచ్చేది. ఊరంతా తిప్పే వాళ్లం. పండగ సంగతేమో గాని ఆ పొగవల్ల దోమలన్నీ పోయేవి. ఇక కొత్తబట్టలు వంటి ముచ్చట్లేవీ మాకు తెలిసేవి కావు. నా వయసు ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుంది. దీపావళి పండుగ వచ్చింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించి పిల్లలం మాకు తెలీదు. అందరు పిల్లల్లాగానే దీపావళి మందుగుండు సామానులు కొనుక్కోవాలని నాన్నను వేధించే వాళ్లం. నాన్న ఏం చేయలేక 2 తన్ని కూర్చోబెట్టేవారు. నా జీవితంలో మా నాన్నగారు పడిన ఆర్ధిక ఇబ్బందుల వలన డబ్బు విలువేమిటో తెలుసుకున్నాను. అందుకే డబ్బును వృథా చేయడం నాకస్సలు ఇష్టముండదు. ఒక ముక్కలో చెప్పాలంటే నేను ఇలా ఉండటానికి కారణం నా జీవితంలోని సంఘటనలే.!” అని తెలియజేశారు మన టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here