మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఒక్కడు’. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టయ్యింది. మహేశ్, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ల నటన, గుణశేఖర్ టేకింగ్ సినిమాను నిలబెట్టాయి. ఇక చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, భూమిక మెడపై కత్తిపెట్టి ప్రకాశ్‌రాజ్ నుంచి మహేశ్ తప్పించుకునే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా ధర్మవరపు సుబ్రహ్మణ్యంను ఆట పట్టించే సీనైతే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. భూమికను అమెరికా పంపించడం కోసం పాస్‌పోర్ట్ కి దరఖాస్తు చేస్తారు. దాన్ని తీసుకురావడానికి మహేశ్, అతని స్నేహితులు పాస్ట్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్తారు. తీరా అక్కడకు వెళ్లేసరికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘కొత్తగా సెల్‌ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని, మొదటగా నీకే ఫోన్ చేశా. నెంబరు చెబుతాను రాసుకో.. 9848032919’ అని ఫోన్ నెంబరు చెబుతాడు.

అప్పటికే అక్కడకు వచ్చిన మహేశ్ పాస్‌పోర్ట్ అడిగితే పోస్ట్‌లో పంపిస్తామని ధర్మవరపు సుబ్రహ్మణ్యం జవాబిస్తాడు. దాంతో ఆ నెంబరుకు ఫోన్ చేసి విసిగిస్తారు మహేశ్ అండ్ కో బ్యాచ్. ఆ బ్యాచ్ చేసే అల్లరికి కోపం వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆ మొబైల్ ను నేలకేసి కొడతాడు. ఇంతలో మళ్లీ మహేశ్ బాబు అక్కడకు వచ్చి పాస్‌పోర్ట్ అడిగి తీసుకుంటాడు. ఈ సీన్ మీకు గుర్తుందిగా.. ఇంతకీ ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పిన ఆ మొబైల్ నెంబరు ఎవరిదో తెలుసా? ఇంకెవరు? ‘ఒక్కడు’ చిత్ర నిర్మాత ఎం.ఎస్.రాజుది.

ఆ సీన్ తీసేటప్పుడు ఎవరి నెంబర్ చెబుదామా? అని అనుకుంటుండగా, ఎవరిదో ఎందుకు నిర్మాత ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అని చిత్ర యూనిట్ లో ఒకరు సలహా ఇచ్చారట. అలా ఆ సన్నివేశంలో నిర్మాత ఎం.ఎస్.రాజు మొబైల్ నెంబర్ ను ఉపయోగించారు. సినిమా విడుదలైన తర్వాత ఆ నెంబర్‌కు కొన్ని లక్షలమంది ఫోన్ చేశారట. ఆ బాధ భరించలేక దెబ్బకు నిర్మాత ఎం.ఎస్.రాజు ఆ మొబైల్ నెంబర్ ను మార్చుకున్నారట. కామెడీలో కామెడీ అంటే ఇదేమరి..!????????



























