ఒకప్పుడు పెళ్లంటే భారీ సెట్టింగులు, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు లక్షల్లో డబ్బులు వెచ్చించి అందంగా డెకరేషన్ చేసి అంగరంగ వైభవంగా జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి వీటన్నింటికి అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దులలో ఉండే వంతెన పెళ్లిళ్లకు వేదికగా మారింది. ఈ వంతెనపై ఇప్పటికే ఎన్నో జంటలు ఒక్కటైన ఘటన చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని మరయూర్ ఇడుక్కి చెందిన వరుడు ఉన్నికృష్ణన్, తమిళనాడులోని దిండుగల్‌లోని బాట్లాగుండు ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి కుదిరింది. ఈ క్రమంలోనే వీరి వివాహాన్ని కేరళలోని వరుడు స్వగ్రామంలో నిర్ణయించారు. అయితే ఈ పెళ్లికి హాజరు కావాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే పెళ్లికి అనుమతించడంతో ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకుని పెళ్లికి హాజరు కాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే తమ పెళ్లి కోసం వధువు తరపు, వరుడు తరపు కుటుంబం నుంచి పది మంది, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని పెళ్లితంతు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోని ఇరు కుటుంబాలు వారి రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి ఒక వంతెన వద్దకు చేరుకున్నారు. వరుడి కుటుంబ సభ్యులు కేరళ వైపు నిలబడి వధువు కుటుంబసభ్యులు తమిళనాడు వైపు నిలబడి వీరి పెళ్ళి తంతు కార్యక్రమాన్ని కొనసాగించారు.
వధూవరులిద్దరూ తమిళనాడు కేరళ రాష్ట్రం సరిహద్దులో వంతెన పై నిలబడి పురోహితుడు లేకుండా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా మాంగల్యధారణ జరగగానే వరుడు వధువుని తీసుకుని తన గ్రామానికి వెళ్లి పోయిన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో వీరి పెళ్లి కావడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదే అదునుగా భావించి ఇప్పటివరకు ఈ వంతెనపై 11 జంటలు వివాహబంధంతో ఒక్కటవడంతో ఈ వంతెన వివాహానికి వేదికగా మారింది.































