దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యులైన కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు లాంటి శిష్యుల్లో ఒకరాయన. కాకపోతే మిగతా శిష్యులతో పోలిస్తే ఈయన ఎంచుకున్న జోనర్ వేరు.ఆయన తీసిన సినిమాలన్నీ విప్లవాత్మక ధోరణిలో ఉండేవి.కార్మికుల కష్టాలు, పేదవారి ఆకలి, ఆక్రందనలే ఆయన ప్రధాన కథ. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, సామాజిక సందేశం, సమాజ మార్పు అనేది గట్టిగా నమ్మిన దర్శకుడు. ఆయన జీవితంలో ఎదురైన, స్వయంగా చూసిన సామాజిక స్థితిగతులను దృశ్య రూపకంగా మలచి నిలువుటద్దంలా ప్రేక్షకుల ముందు ఉంచారు.

పశ్చిమగోదావరి, నరసాపురంలో జన్మించిన ధవళ సత్యం. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రజానాట్య మండలిలో పనిచేశారు.జనసంద్రంలో తాను ఒక ఇసుకరేణువుగ భావించి భావిభారత పునర్నిర్మాణానికి తనవంతు కృషిగా సామాజిక మార్పుకోసం అనేక నాటకాలను ప్రదర్శించారు. సత్యంవధ, ఇరుసు, జ్వాలాశిఖలు లాంటి నాటకాలను ప్రదర్శనతో ఆయనకు మంచి పేరు వచ్చింది. మద్రాసులో అడుగుపెట్టిన తర్వాత ఆయన దాసరి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆయన మహమ్మద్ బీన్ తుగ్లక్, శివరంజని, రంగూన్ రౌడీ, రాముడే రావణుడు లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత సుప్రీం హీరో చిరంజీవితో ఒక సినిమా చేశారు. 1980లో రామరాజు నిర్మాణము, ధవళ సత్యం దర్శకత్వంలో చిరంజీవి, లీలావతి హీరో, హీరోయిన్లుగా జాతర సినిమాలో నటించారు.

ఆ తర్వాత ఎర్రమల్లెలు, యువతరం కదిలింది, గుడి గంటలు మ్రోగాయి, రామాపురంలో సీత, భీముడు లాంటి సినిమాలను రూపొందించారు. ఆ తర్వాత మాదాల రంగారావు కొడుకు మాదాలరవి తో నేను సైతం అనే సినిమాను రూపొందించారు. గిరిజన స్థితిగతులను చూసి, స్పందించిన ధవళ సత్యం వారి జీవన విధానాలపై ఒక సినిమా రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో గిరిజనతండాలో ఒక మహిళకు ఎదురైన ప్రతిబంధకాలు, వాటిని ఎదుర్కోవడంలో ఆ మహిళ ఏ విధంగా పోరాటం చేసి చివరికి గెలిచిందో అనే అంశంపై ఆ రోజుల్లో సపోర్టింగ్ రోల్స్ లో శరత్ బాబు, శ్రీనివాసవర్మ, శారద ప్రధానపాత్రలో “మన్యంలో మంగమ్మ” సినిమా షూటింగ్ ధవళ సత్యం మొదలుపెట్టారు.

దాదాపు పదిహేను రోజుల వరకు షూటింగ్ జరిగిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన కథ శారద ద్వారా ఇతర రచయిత, దర్శకులకు తెలిసింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1997లో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి నారాయణరావు ‘ఒసేయ్ రాములమ్మ’ అనే చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అయితే శారద ప్రధానపాత్రలో ‘మన్యంలో మంగమ్మ’ అనే ఆగిపోయిన సినిమా కథ, ఒసేయ్ రాములమ్మ కథ ఒకటేనని.. దవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన అయన గుర్తు చేసుకున్నారు. “ఒసేయ్ రాములమ్మ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక ఒకసారి దాసరి గారి దగ్గరకి వెళితే.. ఆ రిలీజ్ మూడు రోజుల ముందు ప్రివ్యూ చూపించారు. అది చూసి వచ్చిన తరువాత దాసరిగారు అడిగారు ఎలా ఉందిరా సినిమా అని.. ఒక్కసారి దాసరి గారిని కౌగిలించుకుని అద్భుతంగా ఉంది సినిమా.. అచ్చం నా సినిమాలనే ఉంది. మీరు అడిగి ఉంటే నా స్క్రిప్టే ఇచ్చేవాడిని కదా అని అన్నారట.” ఆ సమయంలో దాసరి గారు మాట్లాడుతూ అందుకే నీకు చూపించాను.. ఈ విషయంలో నేను ఏమీ సిగ్గు పడటంలేదు.. మంచి సినిమా తీసాను అనే తృప్తి నాకు ఉంది” అని చెప్పారట.

































